ట్రెజరీ కథలో కొత్తకోణం | Sakshi
Sakshi News home page

ట్రెజరీ కథలో కొత్తకోణం

Published Fri, Nov 14 2014 2:50 AM

A new angle on the story of the Treasury

చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ.కోట్ల కుంభకోణం కథ మరో మలుపు తిరుగుతుంది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్‌సీల రికార్డులను ఆఘమేఘాల మీద సంబంధిత అధికారులు ట్రెజరీ కథలో కొత్తకోణం విశాఖపట్నం తరలించారు.

ఈ కుంభకోణంలో ఆరోగ్యశాఖ నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారిగా జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారిని నియమించినట్టు తెలిసింది.చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల ఉద్యోగుల జీతాల చెల్లింపు, వివిధ రకాల బిల్లుల లావాదేవీలు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో లేని ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్ల పక్కదారి పట్టించిన సంగతి తెలిసిందే. ట్రెజరీలో అకౌంటెంట్ అప్పలరాజు కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట జరిగిన చెల్లింపుల్లో ఒకేరోజు తన వ్యక్తిగత ఖాతాలో రూ.17 లక్షలు జమ చేసుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

దీంతో అవినీతి కుంభకోణానికి అప్పలరాజును ప్రధాన బాధ్యునిగా చేస్తూ ట్రెజరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశాఖలో లేని ఉద్యోగులకు బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయన్న కోణంలో ఆలోచిస్తే ఆ శాఖ పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో కోరుకొండ, తాజంగి, జర్రెల, సప్పర్ల, పెదవలస, దారకొండ, కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం పీహెచ్‌సీలలో పని చేసిన వైద్యాధికారులు, గుమస్తాలు బోగస్ కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెలుగు చూసింది.

నకిలీ ఉద్యోగుల సృష్టిలో తమ పాత్రేమీ లేదంటూ వైద్యాధికారులు గగ్గోలు పెడుతున్నారు. కాగా రికార్లుల్లో వైద్యాధికారులు తెలిసే సంతకాలు చేశారా? లేక కిందిస్థాయి సిబ్బంది పోర్జరీ సంతకాలతో ఈ అవినీతికి పాల్పడ్డారా? అనే దానిపై కూడా లోతుగా విచారిస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సృష్టి మాట అంటుంచితే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గుడ్డిగా బడ్జెట్‌ను ఎలా కేటాయించారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు ఉందో వెలుగు చూడాలంటే పూర్తిస్థాయి విచారణ తెలపాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement