తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Published Tue, Sep 23 2014 3:12 AM

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

అల్లూరు:  కొంతకాలంగా అల్లూరు మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన అల్లూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పెలైట్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతో కాలంగా అసంపూర్తిగా ఉందని, త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేయించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రజాసేవ విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి ప్రజాభిమానం చూరగొనాలన్నారు. ఎంపీ నిధులుగా ఏటా వచ్చే రూ.5 కోట్లలో ఎక్కువ శాతం కావలి నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే అల్లూరు మండలానికి రూ.75 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అల్లూరు అభివృద్ధికి కృషి :అల్లూరు మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని హాస్టళ్లకు రూ.6 లక్షలతో మరమ్మతులు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు అవస్థ పడుతున్నారని, వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి : అర్హత కలిగిన వారందరికీ పింఛన్ల పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి పలువురు ఎన్నో అపోహలతో తమ వద్దకు వస్తున్నారన్నారు. 65 ఏళ్లు నిండిన వారికే పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ప్రజలు అమోయమానికి గురవుతున్నారన్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా పింఛన్ పథకం అమలు చేయాలన్నారు. అల్లూరు-దగదర్తి మండలాలకు సంబంధించి గతంలో ఉన్న బస్సును తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులతో మాట్లాడి ఆ బస్సును పునరుద్ధరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దండా పద్మావతి, మండల పరిషత్ అధ్యక్షురాలు గంగపట్నం మంజుల, ఎంపీడీఓ కనకదుర్గాభవాని, అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మతో పాటు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, యువజనవిభాగం కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్‌షరీఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీద రమేష్‌బాబు, ఎ.బాలకృష్ణంరాజు, పి.రత్తయ్య, ఎన్‌వీ సాయికుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement