అరెస్టుల పర్వం | Sakshi
Sakshi News home page

అరెస్టుల పర్వం

Published Wed, Sep 24 2014 12:22 AM

అరెస్టుల పర్వం - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(కేడీసీసీబీ) పాలకవర్గంపై టీడీపీ నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మానం గంటకో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం కేడీసీసీబీ చైర్‌పర్సన్ అవిశ్వాస తీర్మానంపై జరగాల్సిన ఓటింగ్‌ను ఆపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశిలిచ్చింది. వాయిదా వేసి కొన్ని గంటలు గడవకముందే మంగళవారం సాయంత్రం బ్యాంక్ అధ్యక్షురాలు చెరుకులపాడు శ్రీదేవిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆమెతో పాటు ఉన్న డెరైక్టర్ లక్ష్మమ్మను కూడా హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరితో పాటే కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొద్దిసేపటికే అరెస్టు కాలేదని నారాయణరెడ్డి అదృశ్యమయ్యారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే కోడుమూరు, కైరవాడి సింగిల్ విండో డెరైక్టర్లు మధుసూదన్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తుండగా మంగళవారం సాయంత్రం టోల్‌ప్లాజా వద్ద డోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెలుగోడుకు తీసుకెళ్లి.. అక్కడ లక్ష్మమ్మ నివాసంలో విచారించి వారి తప్పులేదని తెలిసి వదిలేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సింగిల్ విండో డెరైక్టర్లను టార్గెట్ చేసి టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 పీఠం కోసం ముదురుతున్న వివాదం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని పాలకమండళ్లపై స్థానిక నేతలు కన్నేశారు. అన్నింటిలోనూ టీడీపీ నేతలే ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిని సొంతం చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ చేతిలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ పాలక వర్గంపై కన్నేశారు. అయితే కాంగ్రెస్ నేతలు కేడీసీసీబీ పాలక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరక్కుండా చేయగలిగారు. అయితే ఇరు పార్టీల చర్యలతో వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంటే వారికే వదిలివేయటం మంచిదని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైర్‌పర్సన్ తీరుపై కొందరు డెరైక్టర్లు అసంతృప్తితో ఉన్నారని, అందుకే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇరు పార్టీల నేతల తీరుతో డెరైక్టర్లు కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.



 

Advertisement
Advertisement