‘ఆధార్’ ఊరట! | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ ఊరట!

Published Fri, Sep 27 2013 1:06 AM

'Aadhaar' relief!

సాక్షి, మచిలీపట్నం : ప్రభుత్వం అందించే పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడం సరికాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్డులో రివ్యూ పిటిషన్ వేయడంతో లబ్ధిదారుల్లో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ సర్కార్ అందించే సబ్సిడీలకు ఆధార్ కార్డులను ముడిపెట్టిన విషయం తెలిసిందే. గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీగా  ప్రభుత్వం అందించే అన్ని పథకాల సబ్సిడీలూ పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకానికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా ఉండాలన్న నిబంధన ప్రధాన సమస్యగా మారింది.

నేటికీ పూర్తికాని ‘ఆధార్’ జారీ ప్రక్రియ..

 జిల్లాలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక ఆధార్ కేంద్రం తెరుస్తామని జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి ఇచ్చిన హామీ రోజులు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. వెరసి అటు ఆధార్ కార్డు రాక, ఇటు బ్యాంక్ ఖాతా లేక వేలాది మంది లబ్ధిదారులు ప్రభుత్వ సబ్సిడీని కోల్పోవాల్సిన పరస్థితి ఏర్పడింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల 64 వేల 257 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

వారిలో 5 లక్షల 64 వేల 363 మందికి మాత్రమే ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. దీంతో వారికి మాత్రమే ఈ నెల నుంచి నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 4 లక్షల 99 వేల 894 గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులకు ఆధార్ కార్డులు అందకపోవడంతో బ్యాంకు ఖాతాలను అందించలేకపోయారు. ఆధార్ కోసం ఫొటోలు దిగినవారికి కూడా నేటికీ కార్డులు అందలేదు. ఫొటోలు దిగనివారికి గ్యాస్ సబ్సిడీ దక్కడం లేదు. జిల్లాలో 96 శాతం ఆధార్ కార్డుల ఫొటోలు తీయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 70 శాతం మందికి కూడా పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులు అందలేదు.

పూర్తిస్థాయి ఆధార్ అందినవారు కొందరైతే, ఫొటోలు దిగినట్లు రసీదు మాత్రమే పొందినవారు మరికొందరు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి రావడంతో ప్రతి లబ్ధిదారుడు కచ్చితంగా గ్యాస్ సిలిండర్‌కు రూ.1,016 చొప్పున చెల్లించాల్సిందే. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలను సమర్పించిన వారికి మాత్రం ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. కార్డు అందనివారికి సబ్సిడీ అందటం లేదని, మరోవైపు గ్యాస్ కనెక్షన్ రద్దయ్యే ప్రమాదముందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

 గ్యాస్ సిలిండర్‌కు  రూ.171 అదనపు భారం..

 మరోవైపు నగదు బదిలీ అంటునే గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు రూ.1,016 వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రూ.435 మాత్రమే సబ్సిడీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. దీంతో సిలిండర్ ధర రూ.581 అవుతోంది. నగదు బదిలీ పథకం అమలుకు ముందు వరకు రూ.410 ఉన్న సిలిండర్‌కు ఒక్కసారిగా రూ.171 అదనంగా వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలపై పడకుండా రూ.50 సబ్సిడీగా దివ ంగత మహానేత వైఎస్ ప్రభుత్వం భరించిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కిరణ్ సర్కార్ వచ్చిన తరువాత గ్యాస్ ధరలు సిలిండర్‌కు రూ.25 చొప్పున తగ్గినా మామూలుగానే వసూలు చేశారు. ఇది చాలదన్నట్టు నగదు బదిలీలో రూ.171 అదనంగా వసూలు చేయడంపై జనం మండిపడుతున్నారు.

 ప్రజలకు ‘సుప్రీం’ ఊరట..

 నగదు బదిలీ అమలులో లోపాలు లబ్ధిదారులకు శాపాలుగా పరిణమించిన తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడం సరికాదని, ఆధార్ లేకున్నా సబ్సిడీని అందించాలంటూ మూడురోజుల క్రితం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు జిల్లాలోని ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు లేనివారికి పెద్ద ఊరటనే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.  ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అట్టడుగు స్థాయిలో ప్రజలకు సబ్సిడీలను అందించటంపై దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement