‘ఆధార్’ కాకుంటే రేషన్ కట్! | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ కాకుంటే రేషన్ కట్!

Published Mon, Jul 21 2014 1:40 AM

‘ఆధార్’ కాకుంటే రేషన్ కట్!

 విజయనగరంకంటోన్మెంట్: ఓ వైపు పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎం.డిలు రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయకపోతే సరుకుల సరఫరా నిలుపుదల చేస్తామని హెచ్చరికలు జారీ  చేస్తుంటే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సిన సిబ్బంది నిమ్మ కు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులనూ ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయడం వల్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేయవచ్చని రాష్ట్ర అధికారుల ఉద్దేశమైతే దాన్ని సక్రమంగా అమలు చేయడానికి జిల్లా సివిల్‌సప్లైస్ అధికారులు ముందుకు రాకుండా నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. జిల్లాలో 6 లక్షల 80వేల రేషన్ కార్డులున్నాయి. ఆ కార్డుదారుల్లో కొంతమంది ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొందరికి ఇక్కడి కార్డులతో పాటు అక్కడా ఉన్నాయి. దీని వల్ల రెండు చోట్లా రేషన్ పొందుతున్నారు.
 
 జిల్లాలోని రేషన్ కార్డులన్నింటినీ ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం వల్ల  బోగస్ రేషన్ కార్డులను సులువుగా ఏరివేయవచ్చని ప్రభుత్వం యోచించింది. ఆధార్ అనుసంధానం ఇతర జిల్లాల్లో చాలా వేగంగా నడుస్తోందని ఈ జిల్లాలో ఆలస్యమవుతోందని రాష్ట్ర అధికారులు పలుమార్లు వీడియో కాన్ఫరెన్సుల్లో తెలియజేశారు కూడా. అయినా  ఆధార్ అనుసంధానం మాత్రం పూర్తి కాలేదు.  రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ అనుసంధానం అన్ని జిల్లాల్లో 50 శాతానికి పైగా నమోదైనా జిల్లాలో మాత్రం 27 శాతం మాత్రమే అయింది. జిల్లాలో ఇప్పటికీ 20 శాతం కూడా ఆధార్ అనుసంధానం కాని మండలాలు నాలుగైదు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాచిపెం టలో 19 శాతం, సీతానగరంలో 12, మక్కువలో 18, గుమ్మలక్ష్మీపురంలో19 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగింది. దీంతో జేసీ రామారావు సీఎస్‌డీటీలను ఇటీవల పిలిచి మందలించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు.   
 
 70 రోజుల్లో సాధ్యమా?
 ఇటీవల రాష్ట్ర అధికారులు  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆధార్ నమోదు తక్కువగా ఉందని త్వరలో పూర్తి చేయాలని, లేకుంటే రేషన్‌ను నిలిపివేస్తామని చెప్పడంతో జేసీ బి రామారావు అప్రమత్తమయ్యారు. వెంటనే సీఎస్‌డీటీలతో సమావేశమై సెప్టెంబర్ 30లోగా ఆధార్ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెప్టెంబర్ 30 వరకు గడువు అంటే 70 రోజులు మాత్రమే ఉంది. ఇన్నాళ్లుగా పూర్తికాని ప్రక్రియ ఈ తక్కువ సమయంలోగా పూర్తవడం సాధ్యమయ్యే పనేనా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement
Advertisement