అన్నింటికీ ఆధార్ తిప్పలు | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆధార్ తిప్పలు

Published Wed, Nov 20 2013 4:09 AM

అన్నింటికీ ఆధార్ తిప్పలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆధార్.. దేశంలోని ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య (యూఐడీ)ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కార్డు. ఈ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభించి ఏళ్లవుతున్నా రాష్ర్టవ్యాప్తంగా లక్షలాదిమందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. వీరిలో కొందరు అసలు ఆధార్ కోసం దరఖాస్తే చేసుకోలేదు. మరికొంతమందికి వివరాలు నమోదు చేసుకున్నా వివిధ కారణాల రీత్యా కార్డులు అందలేదు. దీంతో లక్షలాదిమంది ఆధార్ కోసం ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనూ.. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు, ప్రత్యక్ష నగదు బదిలీకి, గుర్తింపు.. చిరునామా ధ్రువపత్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వివాదాస్పదమవుతోంది.
 
 హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వ శాఖలు మాత్రం అన్నింటికీ ‘ఆధార్’ తప్పనిసరి అంటున్నాయి. అంతేకాదు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలంటూ ఉత్తర్వులిస్తున్నాయి. వంటగ్యాస్ సబ్సిడీకి, విద్యార్థుల స్కాలర్‌షిప్పుకు, చివరకు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘బంగారుతల్లి’ పథకానికి  సైతం ఆధార్‌తో లంకె పెట్టడంతో ఈ కార్డులు అందని ప్రజలు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ నమోదును తప్పనిసరి చేశారు. ఆయా జిల్లాల్లో ఆధార్ లేనివారు పూర్తిమొత్తం చెల్లించి గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు. కొన్నిచోట్ల ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ నగదు బదిలీ కింద తమ బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కావడం లేదని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఈ కష్టాలు ఇలావుండగానే ప్రభుత్వ శాఖలు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఆధార్ నమోదును తప్పనిసరి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఉన్నత విద్యకు 7 లక్షల  మంది దూరం!
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ‘ఆధార్’ నిబంధన పెద్ద తలనొప్పిగా మారింది. అర్హులైన మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మందికి పైగా విద్యార్థులకు ఇప్పటివరకు ఆధార్ కార్డులు లేకపోవడంతో వారు కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నగదు బదిలీ పథకానికి ఆధార్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకముందే ఫీజుల పథకానికి ఈ నిబంధనను వర్తింపజేయడం వల్ల అర్హులైన లక్షలాది మంది పేద విద్యార్థులు ఈ ఏడాది ఉన్నత విద్యకు దూరం కానున్నారు. ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే కానీ ఫీజుల పథకం దరఖాస్తు ఈపాస్ వెబ్‌సైట్‌లో కనిపించకుండా సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నిబంధన ప్రకారం విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలంటే యూఐడీ నంబర్ ఇప్పించాలన్న ఆలోచన మాత్రం ఉన్నతాధికారులకు రాలేదు. ఏదోవిధంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కొంతమందికి ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (ఈఐడీ) నంబర్ మాత్రం వచ్చింది. ఈ నంబర్‌ను పేర్కొంటున్న విద్యార్థుల దరఖాస్తులు చెల్లవని ఆధార్ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే ఈవిద్యార్థులంతా మళ్లీ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం యూఐడీ నంబర్ వచ్చే ఫిబ్రవరి లోగా అందుతుందని ఆధార్ వర్గాలే చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కనీసం 7లక్షల మంది ఫీజుల పథకానికి దూరమయ్యే ప్రమాదముందని విద్యార్థి, కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 పింఛన్లు, ‘ఉపాధి’కీ లింకుసామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులు, ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని ఆ శాఖల ఉన్నతాధికారులు నిర్ణయించారు. పెన్షనర్ల జాబితా డిజిటైజేషన్‌తోపాటు, అందరికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరని స్పష్టం చేశారు. సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో భాగంగా వృద్ధాప్య, వితంతు, వైకల్య లబ్దిదారుల జాబితా డిజిటైజేషన్‌తో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్ రెండిటి అనుసంధానం తప్పనిసరి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
 
 ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 22 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసింది. ఏటా దాదాపు రూ.475 కోట్ల మేర  సాయం అందిస్తోంది. అయితే 22 లక్షల మంది పెన్షన్ లబ్దిదారుల్లో కేవలం 3.36 లక్షల మంది లబ్దిదారులకు సంబంధించిన ఆధార్ నంబర్లు మాత్రమే ఇప్పటివరకు అనుసంధానం కావడం గమనార్హం. ఇక ఉపాధి కూలీలకు బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి ప్రస్తుతం వేతనాలు చెల్లిస్తున్నా.. వీరికి కూడా విధిగా ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్రా గ్రామీణాభివృద్ది శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 15వ తేదీ నాటికి ఆధార్‌కార్డు నంబర్లను పరిశీలించాలని, డిసెంబర్ 31వ తేదీ నాటికి అనుసంధానం చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గురించి ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు 1.20 కోట్ల మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉంటే.. అందులో ప్రతి సంవత్సరం ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య 70 లక్షల వరకు ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి. ఇందులో ఆధార్‌ను అనుసంధానం చేసినవారి వివరాలను అధికారులు చెప్పలేకపోతున్నారు.
 
 ‘బంగారుతల్లి’కీ తప్పని ఇక్కట్లు : బంగారుతల్లులకూ ‘ఆధార్’ తిప్పలు తప్పడం లేదు. అన్ని పథకాల్లాగానే ఈ పథకానికి కూడా ఆధార్ నిబంధన అనేక అడ్డంకులు కల్పిస్తోంది. ఇప్పటివరకు బంగారుతల్లి పథకం కింద లక్ష మందికి పైగా చిన్నారులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 30 శాతం మంది తల్లులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో ఆయా తల్లులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు జాప్యం అవుతోంది.
 
 ఆధార్ నమోదుకు సంబంధించి గ్రామీణ, పట్టణప్రాంతాలలో దాదాపు ఒకే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం మంది ఆధార్ నమోదు చేసుకోగా, పట్టణ ప్రాంతాల్లో 75 శాతం మంది నమోదు చేసుకున్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అనంతపురం లాంటి పేద  జిల్లాల్లోని అర్హుల సంఖ్యలో సగం మంది కూడా ఆధార్‌ను సమర్పించలేకపోయారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 9వేల మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 5వేల మంది మాత్రమే ఆధార్ నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోనూ అర్హులైన 6,200 మందికి గాను 3,900 మంది మాత్రమే ఆధార్ ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఐటీడీఏ కేంద్రాల పరిధిలో కూడా ఆధార్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో అక్కడి గిరిజనులు కూడా ఆధార్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు చిన్నారుల తల్లిదండ్రులకు ఉండాల్సిన బ్యాంకు అకౌంట్లు పెద్ద సమస్యగా మారింది.  25 శాతం మందికిపైగా ఇవి లేనట్లు తెలుస్తోంది.
 
 ఆధార్‌పై సుప్రీంలో మరో పిటిషన్
 న్యూఢిల్లీ:ఆధార్ ‘ఇబ్బంది’పై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. నాగరిక్ చేతన మంచ్ అనే ఎన్జీవో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన బీఎస్ చౌహాన్ నే తృత్వంలోని ధర్మాసనం కేంద్రం, ఆర్‌బీఐలను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement