'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు

14 May, 2014 17:00 IST|Sakshi
'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన నెమ్మడి వెంకటేశ్వర్లు, వెడిచెర్ల సతీష్లకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. కేవలం 209 రోజుల్లో అభయ కేసు దర్యాప్తు, విచారణ పూర్తై తీర్పు రావడం విశేషం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు.

ఆరోజు ఏమైంది...
బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్‌లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది.

డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు.  లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు