అవినీతికి అడ్డాలుగా ఆర్టీఏ చెక్‌పోస్టులు | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డాలుగా ఆర్టీఏ చెక్‌పోస్టులు

Published Thu, Oct 10 2013 6:59 AM

ACB raids on checkposts

ఆంధ్రా -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సలాబత్‌పూర్ ఆర్టీఏ చెక్‌పోస్టుపై బుధవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాహనదారుల నుంచి మామూళ్ల రూపంలో వసూలు చేసిన సొమ్ము రూ. 33,500లను స్వాధీనం చేసుకున్నారు. వసూళ్లకు పాల్పడిన ఏఎంవీఐ రమేశ్‌బాబు, అధికారులు నియమించుకున్న బ్రోకర్ (అనధికారిక వ్యక్తి) ఎస్‌కే.హబీబ్‌లపై కేసు నమోదు చేశారు. ఇదే తరహా లో జూన్ 5న కామారెడ్డి ఆర్టీఏ చెక్‌పోస్టుపై కూడా ఏసీబీ దాడి చేసింది. రూ. 1.14 లక్షలు అక్రమసొత్తును స్వాధీనం చేసుకుని, ఎంవీఐ అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమో దు చేశారు. ఏసీబీ ఆరు నెలల్లో 23 కేసులు నమోదు చేసింది.
 
పత్తాలేని చెక్‌పోస్టు ఇన్‌చార్జి..  సలాబత్‌పూర్ చెక్‌పోస్టు ఇన్‌చార్జిగా పర్యవేక్షక ఎంవీఐ ఎన్‌ఎన్.రెడ్డి కొనసాగుతున్నారు. ఎంవీఐల సంఘం రాష్ట్ర నేత అయిన ఈ అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంటారు. ఆయన ఏడాదిలో ఒకటీ రెండుసార్లకు మించి విధులకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో చెక్‌పోస్టుల్లో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. 24 గంటలు చెక్‌పోస్టును పర్యవేక్షించాల్సిన అధికారి ఇలా నెలల తరబడి విధులకు హాజరుకాకపోయినప్పటికీ రవాణా శాఖ ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇన్‌చార్జి ఎంవీఐ తీరు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని తమ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని డీటీసీ రాజారత్నం ‘సాక్షి’తో పేర్కొన్నారు.

నెలకు రూ. కోటిపైనే.. ఒక్కో ఆర్టీఏ చెక్‌పోస్టులో నెలకు కోటి రూపాయలపైనే అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చి వెళ్లే లారీలు, ఇతర వాహనాలకు రేటు నిర్ణయించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. వాహన సామర్థ్యాన్ని బట్టి ఆరు టైర్ల లారీకి ఒక రేటు, ఎనిమిది టైర్ల లారీకి మరోరేటు, భారీ వాహనాలకు ఇంకో రేటు వసూలు చేస్తున్నారు. వాహనదారులు నిర్ణీత మొత్తం చెల్లిస్తే చాలు లోడు అధికంగా ఉన్నా.. ఎక్కువ ఎత్తులో ఉన్నా ఆ వాహన రాకపోకలకు పచ్చజెండా ఊపుతారు. వాహనాల ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోయినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడరు. ఈ దందాలో అధికారులు నియమించుకున్న బ్రోకర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారుల వద్ద వసూలు చేసిన మొత్తాన్ని ప్రతి గంట, రెండు గంటలకు ఒకసారి అక్కడి నుంచి తరలిస్తారు.
 
చెక్‌పోస్టుకు సుమారు రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ బ్రోకర్ల పహారా ఉంటుంది. వీరు ఏసీబీ అధికారుల రాకను కనిపెడుతూ అధికారులకు సమాచారం అంది స్తుంటారు. సలాబత్‌పూర్, కామారెడ్డి ఆర్టీఏ చెక్‌పోస్టులలో రోజుకు రూ. 5 లక్షలకుపైనే అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వసూలు చేసిన మొత్తంలో అధికారుల స్థాయిని బట్టి వాటాలు వేసుకుంటారు. బ్రోకర్లు కొంత మొత్తాని తీసుకుంటున్నారు.
 
చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారుల దాడి.. మద్నూర్ మండలం సలాబత్‌పూర్ ఆర్‌టీఓ చెక్‌పోస్టుపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా డబ్బు కలిగి ఉన్నారంటూ ఏఎంవీఐ రమేశ్‌బాబు, బోధన్ మండలం సాలురకు చెందిన ప్రయివేటు వ్యక్తి షేక్ హబీబ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి నుంచి 33,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్‌పీ సంజీవ్‌రావు కథనం ప్రకారం, దాడులు నిర్వహించిన సమయంలో ఏఎంవీఐ రమేశ్‌బాబు, సిబ్బంది, మరో ప్రయివేటు వ్యక్తి చెక్‌పోస్టులో ఉన్నారు. ఏసీబీ బృందాన్ని చూసి ప్రయివేటు వ్యక్తి బయటకు పరుగులు తీశారు. అధికారులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద అక్రమంగా ఉన్న రూ. 15,320, చెక్‌పోస్ట్‌లోని మరొకరి వద్ద రూ.18,180ను స్వాధీన పర్చుకున్నారు. ఈ చెక్‌పోస్టు గుండా వెళ్లే లారీల డ్రైవర్ల నుంచి సిబ్బంది అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారు.
 
చెక్‌పోస్ట్‌లో ప్రయివేటు వ్యక్తి ఎందుకు ఉన్నాడని ఏఎంవీఐని అడడగా అయన సమాధానం చెప్పలేదు. అతడికి రోజుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నట్టు విచారణలో తేలింది. రోజుకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్టర్‌లో బన్సీలాల్, గంగాధర్ అనే కానిస్టేబుళ్ల సంతకాలు ఉన్నప్పటి వారు విధులలో లేరు. విధుల్లో లేని మరో కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. ఏఎంవీఏ కూడా విధులు సరిగా నిర్వహించడం లేదు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టుకు సమర్పిస్తామని డీఎస్‌పీ తెలిపారు.
 
ఎస్టీడీ బూత్‌లనుంచే.. చెక్‌పోస్టుల సమీపంలోని ఎస్టీడీ బూత్‌లనుంచి బ్రోకర్లు దందా నడిపిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు పరిసరాల్లో ఎస్టీడీ బూత్‌లను తొలగించాలని గతంలో కలెక్టర్ పలుమార్లు ఆదేశించారు. అయినా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వీటిని తొలగిస్తారో లేదో చూడాలి.

Advertisement
Advertisement