అబ్బో.. ఏం ప్రాధాన్యం! | Sakshi
Sakshi News home page

అబ్బో.. ఏం ప్రాధాన్యం!

Published Thu, Jun 12 2014 2:28 AM

అబ్బో.. ఏం ప్రాధాన్యం! - Sakshi

శ్రీకాకుళం: మంత్రి పదవి విషయంలో పంతం నెగ్గించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు శాఖల కేటాయింపులో మాత్రం షాక్ తిన్నారు. ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టడంతో జిల్లాలోని ఆ వర్గంలో నిస్పృహ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ‘కళా’ వర్గం ఒత్తిళ్లు ఏమైనా పనిచేశాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయడు మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆయనకు పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బుధవారం జరిగిన శాఖల కేటాయింపులో అచ్చెన్నకు కార్మిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఇచ్చారు.
 
 ఫలితంగా మంత్రి పదవి దక్కిందన్న ఆనందాన్ని ప్రాధాన్యత లేని శాఖ కేటాయింపు మింగేసింది. ఇది చాలదన్నట్లు జిల్లాలో తమకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న కళావెంకట్రావు మరదలైన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడాన్ని కింజరాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జిల్లా నుంచి మంత్రి పదవి కోసం అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరిస్థాయిలో వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకున్నారు. మొదట్లో కళాకు మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చినా ప్రమాణం స్వీకారం నాటికి అచ్చెన్నాయుడు దాన్ని ఎగరేసుకుపోవడంతో కళా వర్గం చిన్నబోయింది. కింజరాపు వర్గానిదే పైచేయి అవుతోందని ఆందోళన చెందిన కళా వర్గం చంద్రబాబుపై తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని కింజరాపు వర్గంతోపాటు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా టీడీపీలో వర్గపోరును మళ్లీ తీవ్రతరం అవుతుందన్న ఆందోళన వ్యక్తం     చేస్తున్నారు.
 
 ఇదిలా ఉండగా దివంగత వైఎస్ హయాంలో శ్రీకాాకుళం జిల్లా మంత్రలకు రెవెన్యూ, అటవీ, రవాణా వంటి కీలక శాఖలతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఆనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్యం, రోడ్లు, భవనాల శాఖలను కేటాయించడం ద్వారా జిల్లాను గౌరవించగా.. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడం కంటే ప్రాతినిధ్యం లేకుండా చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement