నిరుద్యోగుల బలహీనతే... ఇంధనం | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల బలహీనతే... ఇంధనం

Published Thu, Dec 26 2013 3:47 AM

According nagarapancayati outsourcing jobs is one of the Congress of Rs 50 each

సర్కారీ కొలువు సంపాదిస్తే ఆ సంతోషమే వేరబ్బా... ఇది నిరుద్యోగుల అంతరంగంలో గూడుకట్టుకున్న బలహీనత. ఇదే దళారులకు అయాచిత వరంగా మారింది. ప్రభుత్వం  ఏదైనా కొలువుల నోటిఫికేషన్ విడుదల చేసిందే తడవుగా రంగంలోకి దిగి పోతున్నారు. దళారులను నమ్మవద్దని..ఉద్యోగాలు పారదర్శకంగానే భర్తీచేస్తామని ఓవైపు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ నిరుద్యోగులు మాత్రం గుడ్డిగా వారినే నమ్ముతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా వీఆర్‌ఓ,వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు దళారులకు సంక్రాంతికి ముందే పండగ సీజన్ వచ్చేసింది. నిరుద్యోగుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
 
 నెల్లిమర్ల, న్యూస్‌లైన్:నెల్లిమర్ల నగరపంచాయతీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికనేత ఒకరు సుమారు 20మంది నుంచి తలా రూ.50 వేల చొప్పున మొత్తం వసూలు చేశారు.  డబ్బులు వసూలుచేసి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలకు అతీగతీ లేకపోవడంతో డబ్బులు ముట్టజెప్పిన  నిరుద్యోగులు కక్కలేక.. మింగలేక అన్నట్లు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. అలాగే గత ఏడాది జూలైలో గుర్ల మండలం రౌతుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిరుద్యోగులనుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ నేత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తలా రెండులక్షలు చొప్పున కాజేశాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు వేయించక పోవడంతో బాధితులు సదరు నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే మండ లం పల్లిగండ్రేడు గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగినుంచి అధికారపార్టీ నేత ఒకరు వీఆర్‌ఓ ఉద్యోగం వేయిస్తానని చెప్పి సుమారు ఏడాది క్రితం లక్షరూపాయలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అదే పరిస్థితి. స్థానిక నేతలను నమ్మి వీరే గాదు జిల్లాలోని వందలాదిమంది నిరుద్యోగులు ఇలాగే మోసపోతున్నారు.
 
 ఇప్పటిదాకా హోంగార్డులుగానూ, వీఆర్వోలుగానూ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానూ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు చోటా రాజకీయ దళారులు వందలాదిమందిని మోసం చేశారు. నేతలను నమ్మి డబ్బులు అప్పజెప్పిన నిరుద్యోగులు మాత్రం తాము మోసపోయిన విషయాన్ని ఇప్పటికీ బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్తగా దళారులు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అండదండలున్నవారే  ఈ అవతారమెత్తుతున్నట్లు సమాచారం.  నిన్నమొన్నటిదాకా పలు విభాగాల్లో ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు గుంజిన దళారులు ఇప్పుడు వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ దండుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
 
 జిల్లావ్యాప్తంగా 137వీఆర్‌ఏ, 90 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 28న పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నేతలు నిరుద్యోగుల తల్లిదండ్రులకు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అనుచరులే ఈ విధంగా నమ్మిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో పోస్టు ఇప్పించేందుకు రూ ఐదు లక్షలదాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే వీఆర్‌ఏ పోస్టుకు రూ.రెండులక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరి కొంతమంది దళారులు ఓ అడుగు ముందుకేసి డబ్బులు ఇచ్చినా..టెస్ట్‌కు బాగా ప్రిపేర్ అవ్వాలని ఉచిత సలహాలు కూడా పారేస్తున్నట్లు తెలిసింది. 
 
 దీంతో ఒకవేళ అభ్యర్థి ప్రతిభతో ఉద్యోగం వచ్చినా తమకిచ్చిన డబ్బు నొక్కేయవచ్చుననే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం పదిమంది దగ్గర డబ్బులు వసూలుచేస్తే వారిలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా రూ.ఐదులక్షలు సంపాదించుకోవచ్చని, మిగిలిన వారి సొమ్ములో ఖర్చుల నిమిత్తం  కొంతమొత్తం ఉంచేసుకోవచ్చని ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాత్రం అమాయకంగా నేతలను నమ్మి డబ్బు ముట్టజెబుతున్నారు. తమకు రావాల్సిన ఉద్యోగం ఎక్కడ చేజారిపోతుందోనని డబ్బు ముట్టజెప్పడంలో పోటీకూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు పట్టించుకుని నిరుద్యోగులను మరింత చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement
Advertisement