వీళ్లూ మనుషులే! | Sakshi
Sakshi News home page

వీళ్లూ మనుషులే!

Published Mon, Mar 9 2015 1:25 AM

వీళ్లూ మనుషులే!

దుర్భరమైన పరిస్థితిలో నిర్వాసిత ఆదివాసీలు
పట్టించుకోని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు
 
 అడుగడుగునా ఆంక్షల సంకెళ్ళు.. ఆకలి బాధలు.. పట్టిపీడిస్తున్న అనారోగ్యం..
 మాయమవుతున్న ఆడపిల్లలు.. పోలీసులు, అటవీ అధికారుల వేధింపులు... గ్రీన్‌హంట్ పేరుతో ఛత్తీస్‌గఢ్ నుంచి తరిమివేయబడి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దుల్లో తలదాచుకుంటున్న ఆదివాసీల దుర్భర పరిస్థితి ఇది. ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వారు ప్రమాదంలో పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య నలిగిపోతూ.. ‘గుర్తింపు’ కోసం అర్థిస్తున్నారు.
 - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
 బలవుతున్న ఆడ పిల్లలు..
 
 కొన్నేళ్లుగా ఇక్కడి ఆదివాసీ ఆడపిల్లలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గూడాల నుంచి పది పన్నెండేళ్ళ ఆడ పిల్లలు మాయమై.. ముంబై వంటి చోట్ల రెడ్‌లైట్ ఏరియాలకు చేరుతున్నారు. రేఖపాడు, భద్రాచలం తదితర ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు పని ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. గూడాల్లో తల్లిదండ్రులు లేని సమయంలో వచ్చి ఆడ పిల్లలకు మాయ మాటలు చెప్పి తీసుకెళుతున్నారు. ఇలా మాయమైన పిల్లలకు సంబంధించి గత ఐదారు నెలలుగా ఆచూకీ కూడా లేదు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బలిమెల గ్రామంలో ఆర్నెల్ల కింద 13, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలను తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్ళిపోయారు. తరువాత కొన్ని నెలలకు ‘మేం ఎక్కడున్నామో తెలియదు. ఎలా అక్కడికి రావాలో కూడా తెలియద’ని ఏడుస్తూ ఆ చిన్నారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసారు. ఆ తరువాత అదే ఫోన్‌కి పిల్లల తల్లిదండ్రులు తిరిగి ఫోన్ చేస్తే నంబరు పనిచేయలేదు. వారెప్పుడో ముంబై రెడ్ లైట్ ఏరియాకి చేరిపోయారని, ఇదిక్కడ మామూలేనని కొందరు వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ప్రాణ భయంతోనో, దళారులు చూపిన డబ్బు ఆశతోనో ఆదివాసీలు వారి బిడ్డలను అమ్ముకుంటున్న దయనీయస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది.
 
 నిండు దారిద్య్రం..
 
 ఛత్తీస్‌గఢ్ నుంచి 2008లో వలస వచ్చిన ఈ ఆదివాసీలు దుర్భర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 14 మండలాల్లో 133 సెటిల్‌మెంట్స్ (గూడాలు)లో 11,110 మంది నివాసం ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో మొత్తం 37 సెటిల్‌మెంట్స్ లో 4,820 మంది, పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో 17 సెటిల్‌మెంట్స్‌లో 1,842 మంది ఆదివాసీలు ఉంటున్నారు. 2009లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో మొత్తం 16,000 మంది నిర్వాసిత ఆదివాసీలున్నారు. అయితే మొత్తం నిర్వాసిత ఆదివాసీల జనాభా 50 వేలకు పైగానే ఉంటుందనేది ఒక అంచనా.
 
 
 విభజనతో సమస్యలు


 రాష్ట్ర విభజన కూడా ఆదివాసీలకు కష్టాలు మొదలయ్యాయి. గత ఆర్నెళ్లుగా ఆయా ప్రాంతాల్లోని విద్యా వలంటీర్లకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం ఎవరూ కూడా వేతనాలు ఇవ్వలేదు. మైళ్ల దూరం నడిచి వెళ్ళి పాఠాలు చెప్పాల్సిన ఈ వాలంటీర్లు.. జీతాలు ఇవ్వకపోతుండడంతో వెళ్లడం లేదు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలకు కులం (క్యాస్ట్) సర్టిఫికెట్‌ను నిరాకరిస్తుండడంతో ఎందరో విద్యార్థులు చదువు కొనసాగించలేకపోతున్నారు. రామచంద్రాపురం నుంచి 2013లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఒక విద్యార్థికి గుత్తికోయగా గుర్తింపు లేకపోవడంతో.. క్యాస్ట్ సర్టిఫికెట్‌ను నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థి పై చదువులు చదవలేక బంగారు భవిష్యత్తుని కోల్పోవాల్సి వచ్చిందని ఏఎస్‌డీఎస్ డెరైక్టర్ గాంధీ బాబు తెలిపారు.
 
 పోలీసుల చేతిలోనూ..


 ఛత్తీస్‌గఢ్ నిర్వాసిత ఆదివాసీలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా మావోయిస్టులంటూ పోలీసులు పట్టుకుపోతున్నారు. అంతా సజావుగా ఉందనుకున్నప్పుడు కూడా పోలీసుల వేధింపులు తగ్గడం లేదు. రోజూ ఇద్దరు ముగ్గురు వెళ్లి దగ్గరలోని పోలీసుస్టేషన్‌లో అడ్డమైన చాకిరీ చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా వారిని పట్టించుకోని ప్రభుత్వాల తీరు మారకపోతే ఛత్తీస్‌గఢ్ నిర్వాసిత ఆదివాసీల జీవితాలు ఇంకా ప్రమాదంలో పడతానయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పోలీసులు, అటవీ అధికారుల నుంచి తక్షణమే వీరికి రక్షణ కల్పించాలని సాలిడారిటీ కమిటీ నాయకులు పిఎస్ అజయ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.
 
 ఆరోగ్యం మిథ్య..
 
 ఇక్కడి గుడిసె గుడిసెలో ఆకలి, అనారోగ్యం తాండవిస్తుంది. నూటికి 95 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏ చిన్నారిని చూసినా నెత్తురింకిన ఎముకల గూడులా కనిపిస్తారు. అంగన్‌వాడీలు సక్రమంగా పనిచేస్తున్న దాఖలాల్లేవు. ఆరు నెలలుగా సరిగా ఆహారం అందని గ్రామాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల ఒత్తిడితో కొన్ని చోట్ల అంగన్ వాడీలకు ఆయాలను ఏర్పాటు చేసినా... పిల్లలకు మాత్రం పోషకాహారం సరిగా అండం లేదు. ఇక రెసిడెన్షియల్ బ్రిడ్జి క్యాంపుల్లో 2010 నుంచి 2012 మధ్య ఆల్టర్నేటివ్ లెర్నింగ్ స్కూల్ పేరుతో ఏర్పాటు చేసిన సింగిల్ టీచర్ స్కూళ్లలో వెయ్యి మందికి పైగా పిల్లలు చేరారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో మరో 200 మంది పిల్లలను బయట హాస్టళ్లలో చేర్చారు. కానీ 2012 తరువాత ఇక్కడి ఆదివాసీలకు విద్య దూరమైంది. కారణం విద్యాహక్కు చట్టం ప్రకారం మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తామంటూ ఉన్న పాఠశాలలను ప్రభుత్వం ఎత్తివేయడమే.

Advertisement
Advertisement