Sakshi News home page

ఎన్నికల నాటికి పాలనా నగరం సిద్ధం కావాలి

Published Thu, Jul 20 2017 12:53 AM

ఎన్నికల నాటికి పాలనా నగరం సిద్ధం కావాలి - Sakshi

సీఎం చంద్రబాబు ఆదేశం
 
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగర నిర్మాణ పనుల్ని విజయదశమికి ప్రారంభించి.. వచ్చే ఎన్నికల నాటికల్లా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2019 మార్చి 31 నాటికి పరిపాలనా నగరం అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో రాజధాని నిర్మాణ వ్యవహారాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ, 30 నాటికి హైకోర్టు భవనాల తుది డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇవ్వనుందని, దీని ఆధారంగా పనుల ప్రణాళికను తయారుచేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు వివరించారు.

25 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయని.. వాటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు శ్రీధర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. ఈ సంస్థలకు అవసరమైన భూమిని ఉచితంగా అందించేందుకైనా సిద్ధమని చెప్పారు. ప్రపంచ ప్రమాణాలు గల విద్యాసంస్థలు స్థాపించేందుకు ఎవరు ముందుకొచ్చినా వెంటనే అనుమతులిస్తామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ నుంచి కనకదుర్గ గుడికి వెళ్లే మార్గాలను ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ జోన్‌లోకి బయటి వాహనాలను అనుమతించకుండా ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, జల రవాణాను కూడా ఇందులో అంతర్భాగం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 110 పట్టణాలను పోస్టర్‌ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న గోడలను వివిధ కళాకృతులతో అలంకరించాలని మున్సిపల్‌ అధికారులకు సీఎం సూచించారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలోని 90 వేలకు పైగా ఉన్న పందులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం సూచించారు. 
 
జగన్‌ హామీలతో డ్వాక్రాపై వరుస సమావేశాలు 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో సీఎం చంద్రబాబులో ఆందోళన మొదలైంది. దీంతో డ్వాక్రా మహిళల సమస్యలపై వరుసగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. డ్వాక్రా వ్యవహారాలపై వారం కిందట అధికారులతో సమావేశమైన సీఎం.. బుధవారం మరోసారి సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంకు అధికారులు, టాటా ట్రస్టు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement