ఆప్యాయతకు మారుపేరు ‘కాకా’ | Sakshi
Sakshi News home page

ఆప్యాయతకు మారుపేరు ‘కాకా’

Published Thu, Jan 22 2015 3:47 AM

ఆప్యాయతకు మారుపేరు ‘కాకా’ - Sakshi

సాక్షి, హైదరాబాద్: దళిత, పేద, కార్మిక వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) ఎనలేని సేవలందించారని... ఆత్మీయతకు ఆయన మారుపేరుగా నిలిచారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు శ్లాఘించారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత ‘కాకా’ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు  నేతలు హాజరయ్యారు.
 
తెలంగాణ జాతి సంపద ‘కాకా’: కేసీఆర్
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వెంకటస్వామి.. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అత్యున్నత పదవులను సమర్థంగా నిర్వహించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వ ర్గాలవారూ ఎంతో ఆప్యాయతతో ‘కాకా’గా పిలిచే వెంకటస్వామి తెలంగాణ జాతి సంపద అన్నారు.  వెంకటస్వామి స్మారకంగా హైదరాబాద్‌లోని ప్రధాన కూడలిలో నిలువెత్తు విగ్రహంతో పాటు ఒక మెమోరియల్ భవనాన్ని కూడా ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ఇక అసంఘటిత రంగ కార్మికులకు భవిష్యనిధి ద్వారా పింఛను పొందే అవకాశం రావడానికి ఆద్యుడు వెంకటస్వామేనని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేటి తరం నాయకులకు వెంకటస్వామి జీవితం ఆదర్శం కావాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. కేంద్ర మంత్రిగా వెంకటస్వామి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పారు.

కార్మికులకోసం వెంకటస్వామి ఎంతో పాటు పడ్డారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా శ్లాఘించారు.హోం మంత్రి నాయిని ,కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహు లు, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,  , సీపీఐ నేతలు నారాయణ, చాడ , రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, గద్దర్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement