Sakshi News home page

మధ్యాహ్నం.. అధ్వాన్నం

Published Fri, Sep 20 2013 3:10 AM

Afternoon meals provideing very badly food

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : విద్యాశాఖ నిర్వాకం కారణంగా మధ్యాహ్న భోజనానికి ఇచ్చే నిధులు ఇప్పటికే రూ.12 కోట్ల వరకు నిర్వాహకులకు బకాయిపడ్డాయి. అప్పులు తెచ్చి మధ్యాహ్న భోజనం పెడుతున్న నిర్వాహకులు... పెరుగుతున్న ధరల భారం భరించలేక ఇబ్బందిపడుతున్నారు. వారానికి రెండుసార్లు కోడిగుడ్డు పెట్టడానికి తమ దగ్గర డబ్బులు ఉండడంలేదని వాపోతున్నారు.
 
 అధికారులు, విద్యార్థుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం నిర్వహణను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయులు ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలో 2050 ప్రాథమిక, 375 ప్రాథమికోన్నత, 643 ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 2.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.35, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక్కరికి రూ.6 చొప్పున మధ్యాహ్న భోజనం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి.
 
 రెండు రకాల విద్యార్థులకు కలిపి ఒక్కొక్కరికి సగటున రూ.5 మధ్యాహ్న భోజనానికి ఖర్చువుతోంది. జిల్లాలో రోజుకు రూ.13.50 లక్షలు ఉంటోంది. నెలకు అయితే సగటున రూ.4.50 కోట్లు ఖర్చవుతోంది. 2013 జూన్ 12 పాఠశాల విద్యాసంవత్సరం మొదలైంది. మధ్యాహ్న భోజనం నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం గ్రీన్‌చానల్‌లో చేర్చింది. వచ్చే ఏడాది మార్చి వరకు అవసరమైన నిధులను విడుదల చేసింది. మధ్యాహ్న భోజనం నిర్వహణ ఖర్చులు వెంటవెంటనే ఆయా పాఠశాలలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విరుద్ధంగా వ్యవహరించే జిల్లా విద్యాశాఖ ఈ విషయంలోనూ ఇలాగే చేస్తోంది. మండలాలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది కంటే విద్యార్థులు తగ్గారా... పెరిగారా అనే వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు. విద్యార్థుల సంఖ్య కంటే ఇచ్చే నిధులు ఎక్కువ ఉండడం లేదా, తక్కువ ఉండడం జరిగింది. విద్యాశాఖ కార్యాలయంలోనే ఈ పొరపాటు జరిగినట్లు ట్రెజరీ అధికారులు గుర్తించారు. బిల్లులను నిలిపివేశారు. అయినా విద్యాశాఖ దీన్ని సరిచేసుకోవడంలేదు. దీంతో మధ్యాహ్న భోజనం నిధులు పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. ఇది ఎప్పటివరకు సరిచేస్తారనేది అర్థంకాని విధంగా ఉంది. నివేదిక తయారీలో తప్పలు చేసిన విద్యాశాఖ... వాటిని సరిదిద్దుకోకుండా పేద పిల్లలకు పాఠశాలలో తిండిపెట్టేందుకు అడ్డంపడుతోంది.
 
 అందని వేతనాలు..
 మధ్యాహ్నభోజనం ఏజెన్సీ నిర్వాహకుల శ్రమఫలం విషయంలోనూ అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నభోజనం నిర్వాహకులకు ఒకరికి రూ.వెయ్యి చొప్పున వేతనం గా ఇస్తున్నారు. 25లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకరు నిర్వాహకులుగా ఉంటారు. 100 మంది విద్యార్థులుంటే ఇద్దరు, 200 మంది ఉం టే ముగ్గురు, 200 కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో నలుగురు నిర్వాహకులు ఉంటారు. వీరికి నెలకోసారి ఇవ్వాల్సిన వేతనాన్ని చెల్లించకుండా జిల్లా విద్యాశాఖ చోద్యం చూస్తోంది. నెల రోజుల కష్టపడితే వచ్చే రూ.వెయ్యి ఇచ్చేం దుకు సైతం విద్యాశాఖకు చేతులు రావ డం లేదని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.
 బిల్లులు పూర్తి చేస్తున్నాం..
 
 - కె.లింగయ్య, జిల్లా విద్యాధికారి
 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవలే మొత్తం నిధులు వచ్చాయి. మా దగ్గరికి వచ్చిన బిల్లులను పూర్తి చేస్తున్నాం. కొన్ని మండలాల్లో పెరిగిన చార్జీల ప్రకారం బిల్లు పెట్టకపోవడం వల్ల ఇబ్బంది వస్తున్నట్లుంది
 

Advertisement

తప్పక చదవండి

Advertisement