మళ్లీ విలీనం గోల | Sakshi
Sakshi News home page

మళ్లీ విలీనం గోల

Published Tue, Dec 17 2013 1:17 AM

Again because of the merger

=విలీన పంచాయతీలపై ప్రజాభిప్రాయ సేకరణ
 =గ్రామస్తుల నుంచి వ్యతిరేకత..
 =రాజకీయ నాయకుల ఒత్తిడి
 =ఇరకాటంలో అధికారులు

 
జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ప్రజాభిప్రాయం తీసుకొనే ఈ ప్రక్రియ చేపట్టాలంటూ కోర్టు ఆదేశించడంతో అధికారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంటే నిరసన వ్యక్తమవుతోంది. మరో వైపు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది.
 
సాక్షి, విశాఖపట్నం: ప్రజల నుంచి వ్యతిరేకత, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు అధికారులను ఇరకాటంలో పెడుతున్నాయి. జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రక్రియ మళ్లీ మొదటికి రావడంతో ఈ సమస్య ఎదురవుతోంది. తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేయడమేంటని సంబంధిత గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడంతో కథ మొదటికొచ్చిన విషయం తెలి సిందే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో స్థానిక అధికారులకు తలనొప్పి ప్రారంభమైంది. విలీనానికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని, తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు తమ అభిప్రాయాన్ని యథాతథంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విలీన గ్రామస్తులు గట్టిగా చెబుతున్నారు.
 
మధ్యలో ఉన్న గ్రామాలను కలుపుకుంటే తప్ప అనకాపల్లి, భీమిలి మున్సిపాల్టీలను జీవీఎంసీలో విలీనం చేయలేరన్న నిబంధనతో ప్రభుత్వం ఆదరాబాదరగా పంచాయతీరాజ్ నుంచి డీనోటిఫై చేస్తూ పది గ్రామాల్ని ఏకపక్షంగా కలిపేసింది. ఇందులో పరవాడ మండలంలోని తాడి, సాలాపువానిపాలెం, అనకాపల్లి మండలంలోని వల్లూరు, రాజుపాలెం,కొప్పాక గ్రా మాలు, భీమిలి మండలంలోని కె.నగరంపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జె.వి.అగ్రహారం గ్రామాలున్నాయి.

ఈ గ్రామాల రికార్డుల్ని కూడా జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. సంబంధిత పంచాయతీ ఎన్నికల్ని పరోక్షంగా అడ్డుకుంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భీమిలి మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా  విలీ నం చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో సంబంధిత గ్రామాల అభిప్రాయాల్ని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, స్వాధీనం చేసుకున్న పంచాయతీ రికార్డులను వెనక్కి ఇచ్చేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. భీమిలి మండల పంచాయతీలకు రికార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం  తాజాగా మరో ఉత్తర్వు ఇచ్చింది. భీమిలి మండలంలోని పంచాయతీలతో పాటు పరవాడ, అనకాపల్లి పంచాయతీల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు.
 
తొలుత భీమిలి మండలం కె.నగరంపాలెంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి డి.వి.మల్ల్ఛ్చిర్జునరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి జీవీఎంసీలో ఎందుకు విలీనం చేయకూడదో అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. కానీ స్థానికులు తీవ్రంగా వ్యతి రేకించారు. ప్లకార్డులు ప్రదర్శించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవీఎంసీలో విలీనమైతే పన్నులు పెరుగుతాయని, ఉపాధి పనుల్ని కోల్పోతామని కూడా ఆందోళన తెలియజేశారు. పంచాయతీల విలీనం వల్ల రియల్ ఎస్టేట్, బడాబాబులకే ప్రయోజనం తప్ప చేపలు పడితే గాని జీవనం సాగని తమలాంటి కుటుంబాలకు కాదని గ్రామస్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.

ప్రజాభిప్రాయం ఇలా ఉంటే విలీనానికి అనుకూలంగా ఎలాగోలా తతంగాన్ని పూర్తి చేయాలంటూ మరోవైపు అధికారులపై నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ ముందే పసిగట్టిన విలీన ప్రతిపాదిత గ్రామాల నాయకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ మతలబు చేస్తారోనని గ్రామ సభ జరిగిన తీరును, ప్రజాభిప్రాయ సేకరణపై వీడియో కూడా తీస్తున్నారు. ఇరువర్గాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement