మళ్లీ నకిలీ ‘మావో’ల హల్‌చల్ | Sakshi
Sakshi News home page

మళ్లీ నకిలీ ‘మావో’ల హల్‌చల్

Published Fri, Jun 26 2015 2:10 AM

Again fake 'Hulchul mavola

బత్తిలి(భామిని): మావోయిస్టుల బెదిరింపులు లేని తరుణంలో వారి పేరిట బినామీలు రెచ్చిపోతున్నారు.  సరిహద్దులోని భామిని మండలం బత్తిలికి చెందిన వ్యాపారులకు ఇలా లేఖలు పంపి, ఫోన్లు చేసి.. సరిహద్దులోని రహస్య స్థావరాలకు రప్పించి డబ్బులు వసూలు చే స్తున్నారు. వారం రోజల్లో ఇలా నలుగురి నుంచి బాగానే వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా బత్తిలి పోలీసులు వ్యాపారుల రాకపోకలపైన, నకిలీ మావోయిస్టులపైనా నిఘా పెంచారు. హెచ్చరిక లేఖలు తెచ్చే ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని మిగతా సూత్రధారుల కోసం వల వేశారు. హెచ్చరిక లేఖలు అందుకున్న వ్యాపారుల నుంచి వివరాలు సేకరించిన బత్తిలి ఎస్సై రామారావు కేసు నమోదు చేశారు. కొత్తూరు సీఐ అశోక్ కుమార్ కూడా నేరుగా బత్తిలి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అనుమానితుని నుంచి వివరాలు సేకరించారు.
 
 ఇవి నకీలీ లేఖలే...
 తమ చేతికి చిక్కిన లేఖలను పరిశీలించిన పోలీసులు ఇవి ముమ్మాటికీ నకిలీ మావోయిస్టుల పనేనని తేల్చారు. డబ్బుతోపాటు తినేందుకు బియ్యం, పప్పు, ఇతర పచారీ సరుకులు తెమ్మని రాయడంతో ఇది బినాలమీల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
 
 గతంలోనూ...
 సరిహద్దులోని వ్యాపారులను నక్సలైట్ల పేరిట లేఖలు పంపి బెదిరించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ఏడాది, 2014 జూలైలోనూ  భామిని మండలంలో లేఖలు పంపారు. అక్రమ వసూళ్లు చేపట్టారు. కొత్తూరు ఏటీఎం చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న తరుణంలో బినామీ నక్సలైట్ల గుట్టు రట్టైంది. అదే బృందం మరోసారి జడలు విప్పి అక్రమ వసూళ్ల కోసం బెదిరింపు లేఖలు పంపి భారీగా వసూలు చేస్తున్నట్లు, ఒడిశాకు చెందిన నకిలీలకు, భామిని మండాలనికి చెందినవారు  సహకరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
 
 నకిలీ మావోయిస్టు అరెస్టు
 బత్తిలి(భామిని): సరిహద్దులోని వ్యాపారులను మావోయిస్టుల పేరిట లేఖలు పంపి, అక్రమంగా డబ్బులు వసూలు పాల్పడుతున్న ఒడిశాలోని గుణుపూర్‌కు చెందిన లాడి వెంకటరావును అరెస్టు చేసినట్లు బత్తిలి ఎస్సై సిహెచ్ రామారావు గురువారం రాత్రి ప్రకటించారు. భామిని మండలం మనుమకొండకొండ రోడ్డులో సంచరిస్తుండగా వెంకటరావును పట్టుకున్నట్లు తెలిపారు. బత్తిలికి చెందిన వ్యాపారికి మావోయిస్టుల పేరిట బెదిరింపు లెటర్ పంపించి, రూ. రెండు లక్ష లు తెమ్మని హెచ్చరించి, రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. ఈ మేరకు మనుమకొండ రోడ్డుకు డబ్బు తెమ్మని చెప్పి అక్కడ ఉండగా,  మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement