మళ్లీ పాత లెక్కే! | Sakshi
Sakshi News home page

మళ్లీ పాత లెక్కే!

Published Sun, Jan 11 2015 3:20 AM

మళ్లీ పాత లెక్కే! - Sakshi

అనంతపురం అగ్రికల్చర్:  మళ్లీ పాత లెక్కల ప్రకారమే వ్యవసాయ శాఖ అధికారులు కరువు నివేదిక తయారు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను తరువాత గత ఏడాది అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 9 జిల్లాకు వర్తింపజేసే పరిస్థితి కనిపించడం లేదు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలనే దానిపై కొత్త స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) జిల్లాకు కూడా వర్తిస్తుందని అధికారులు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు పాత జీవో ప్రకారమే ముందుకు వెళుతున్నారు.

జిల్లాలో పంట నష్టం అంచనాల తయారీలో డిసెంబర్ 10 నుంచే అధికారులు నిమగ్నమయ్యారు. తొలుత పాత స్కేల్ ఆఫ్ రిలీఫ్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. పది రోజుల కిందట కొత్త జీవో ప్రకారం చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ పీవీ శ్రీరామమూర్తి కూడా ధ్రువీకరించారు. అయితే.. మళ్లీ పాత స్కేల్‌ఆఫ్ రిలీఫ్ ప్రకారమే నివేదిక తయారు చేయాలంటూ రెండు రోజుల కిందట జిల్లా అధికారుల నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి.

పాత లెక్కల ప్రకారం హెక్టారు వేరుశనగ పంటకు రూ.10 వేల నష్టపరిహారం ఉంది. జీవో9 ప్రకారమైతే రూ.15 వేలుగా నిర్ణయించారు. విశాఖ తుపాను, అనంతపురం జిల్లా కరువు.. రెండింటినీ ప్రకృతి వైపరీత్యాల కిందే పరిగణిస్తున్నారు. అయినా స్కేల్ ఆఫ్ రిలీఫ్ వర్తింపులో స్పష్టత లేదు. దీనివల్ల పంట నష్టం అంచనాల తయారీలో అధికారులు, సిబ్బంది గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

పంట నష్టం అంచనాలు కూడా రూ.850 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పాత నిబంధనల ప్రకారమే అంచనాలు తయారు చేస్తున్నట్లు జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఒకవేళ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నష్టపోయిన రైతుల సంఖ్యలో తేడా ఉండదని, అంచనా మొత్తం మాత్రమే మారుతుందని చెప్పారు.
 
 పంటలకు ‘స్కేల్ ఆఫ్ రిలీఫ్’ ఇలా...
 పంట పేరు                పాత జీవో ప్రకారం            జీవో 9 ప్రకారం
                         (హెక్టారుకు రూ.లలో)        (హెక్టారుకు రూ.లలో)

 వేరుశనగ, వరి, పత్తి                10,000                    15,000
 మొక్కజొన్న                        8,333                    12,500
 పొద్దుతిరుగుడు                          6,250                    10,000
 పప్పుధాన్యపు పంటలు                6,250                    10,000

Advertisement
Advertisement