స్వర్ణంపై వ్యవసాయ రుణాలివ్వరే | Sakshi
Sakshi News home page

స్వర్ణంపై వ్యవసాయ రుణాలివ్వరే

Published Mon, Jul 7 2014 1:41 AM

స్వర్ణంపై వ్యవసాయ రుణాలివ్వరే - Sakshi

- కో-ఆపరేటివ్ బ్యాంకుల తీరుతో రైతుల ఆవేదన
- అధిక వడ్డీకి వ్యాపార రుణాలు ఇస్తున్న వైనం

 పెరవలి : రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆ రైతుల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడటం లేదు. బంగారంపై వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్యాంకుల ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాన్ని ఇవి నీరుగారుస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. బంగారాన్ని కుదవపెట్టుకుని వ్యవసాయ రుణాలుగా కాకుండా వ్యాపార రుణాలుగా ఇవ్వటంతో రైతులు విస్తుపోతున్నారు.

మూడేళ్ల నుంచి ఇదే తంతు నడుస్తోందని రైతులు చెబుతున్నారు. గత్యంతరం లేక వారు అధిక వడ్డీకి బయట అప్పులు చేస్తున్నారు. తమ కోసం ఏర్పడిన ఈ బ్యాంకులు వ్యవసాయ అవసరాలు తీర్చలేనప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కో-ఆపరేటివ్ బ్యాంకులు బంగారంపై వ్యవసాయ రుణాలు తప్ప మూడు వడ్డీ శ్లాబ్‌లలో వ్యాపార రుణాలు ఇస్తుండగా, జాతీయ బ్యాంకులు మాత్రం బంగారంపై వ్యవసాయ రుణాలు ఇస్తున్నాయి.

కో-ఆపరేటివ్ బ్యాంకు ఇచ్చే రుణాలపై 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా జాతీయ బ్యాంకులు 7 శాతమే వడ్డీ వసూలు చేస్తున్నాయి. కో-ఆపరేటివ్ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్ గోల్డ్‌లోను తీసుకుంటే గ్రాముకి రూ.2 వేల చొప్పున ఇస్తూ 13శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.లక్ష పైన తీసుకుంటే 12.5 శాతం, రూ.లక్ష లోపు తీసుకుంటే 12 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు మాత్రం పంట భూమికి పన్ను చెల్లించిన రశీదు తీసుకువెళ్తే 7శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి.

నాలుగేళ్ల క్రితం వ్యవసాయ రుణాలు కూడా ఇచ్చిన కో-ఆపరేటివ్ బ్యాంకులు ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి వ్యాపార రుణాలుగా మాత్రమే ఇస్తున్నారు. రైతుల కోసం ఏర్పడిన ఈ బ్యాంకులు వారి నుంచే అధిక వడ్డీ వసూలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలిక రుణాలకు సబ్సిడీ కూడా ఇచ్చే ఈ బ్యాంకులు, రైతులు వ్యవసాయ అవసరాలకు తీసుకునే రుణాలపై అధిక వడ్డీ వసూలు చేయటం ఏమిటనేది రైతుల మరో ప్రశ్న.

Advertisement

తప్పక చదవండి

Advertisement