వాయు వేగం.. గురి తప్పని లక్ష్యం | Sakshi
Sakshi News home page

వాయు వేగం.. గురి తప్పని లక్ష్యం

Published Thu, Nov 13 2014 3:35 AM

వాయు వేగం.. గురి తప్పని లక్ష్యం

తన జట్టు క్రీడాకారుడు ఖో.. అనగానే రేసుగుర్రంలా పరుగెడతాడు వెంకటేష్. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఇక ముచ్చెమటలే. మెరుపులా దూసుకెళ్తూ అవతలి జట్టు క్రీడాకారుల్ని ఔట్ చేస్తాడు. వాయివేగంతో.. గురి తప్పని లక్ష్యంతో ఆడుతూ ఆట అంటే ఏంటో చూపెడుతాడు. జట్టు విజయం కోసం ఒక్కడే పోరాడుతాడు.

చూసేవాళ్లకు ఇదేదో ఇంద్రజాలమా అన్నట్లు ఆశ్చర్యం కలిగిస్తాడు. అందుకే ఆయన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఓ కుగ్రామానికి చెందిన ఈ విద్యార్థి త్వరలో ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లే చాన్స్ కొట్టేశారు.  -ఎమ్మిగనూరు టౌన్
 
   కె. వెంటేష్‌ది నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం అలువాల గ్రామం. వీరిది ఓ చిన్న రైతు కుటుంబం. తల్లిదండ్రులు కె.ఈరన్న, పార్వతి. పాఠశాల స్థాయి నుంచే వెంకటేష్ ఖోఖోలో రాణించేవారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈయన బైపీసీ (సెకెండ్ ఇయర్) చదువుతున్నారు. ఎనిమిదో తరగతిలో చదువుతున్నప్పుడు ఆటలో ప్రావీణ్యాన్ని చూసి ఆ హైస్కూల్ పీఈటీ ప్రభాకర్ ఖోఖోలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఆయన ప్రోత్సాహంతో నంద్యాలలో జిల్లా స్థాయి అండర్-14, గన్నవరంలో సబ్ జూనియర్స్, ఏలూరు, ఆదిలాబాద్‌లో పైకా పోటీల్లో పాల్గొని మంచి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ మీట్స్‌తో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి పైకా పోటీలు, జోనల్స్ పోటీల్లో పాల్గొంటూ తన సత్తాను చాటుతూ వచ్చారు.
 
   జట్టు ఓడినా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
 ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం, ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఖోఖో పోటీలకు జిల్లా జట్టు తరఫున వెంకటేష్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించడంతో ఇటీవల ఉజ్జయినిలో జరిగిన అండర్-19 జాతీయ ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడారు.

అందులో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించకపోయినా వెంకటేష్ కనబరిచిన ప్రతిభ జాతీయ సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే అండర్-19 అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఇండియా జట్టుకు సెలెక్టర్లు ఆయనను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా జట్టుకు ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటేష్ కావడం విశేషం.

Advertisement
Advertisement