ఫుల్‌గా తాగించారు.. దండిగా దోచేశారు  | Sakshi
Sakshi News home page

ఫుల్‌గా తాగించారు.. దండిగా దోచేశారు 

Published Thu, Jun 6 2019 3:59 AM

Alcohol supplies with belt shops during Chandrababu Govt - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన హయాంలో రాష్ట్రమంతటా మద్యాన్ని ఏరులై పారించారు. టార్గెట్‌లు పెట్టి మరీ మద్యాన్ని తాగించే చర్యలు చంద్రబాబు సర్కారులో యథేచ్ఛగా కొనసాగాయి. ఏకంగా రూ.75,259 కోట్లను ప్రజల నుంచి పీల్చేశారు. ప్రజలను మద్యానికి బానిసలు చేసేలా డోర్‌ డెలివరీ ఏర్పాట్లు జరిగాయి. జనాన్ని మద్యానికి బానిసలుగా మార్చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పగటి పూట కూడా రోడ్డు పక్కన టీ తాగినట్లు మద్యం దుకాణాల దగ్గర బహిరంగంగా తాగేస్తున్నారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారు. మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా, ఆర్థికంగా నష్టపోయి లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నా, ఆడపడుచుల ఆక్రందనలు వినిపిస్తున్నా...చంద్రబాబు ఖజానా నింపుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఇంకా తాగించండంటూ ఆబ్కారీ శాఖకు టార్గెట్లు పెట్టి మరీ బొక్కసాన్ని నింపుకున్నారు.

టీడీపీ హయాంలో అడుగడుగునా బెల్ట్‌ షాపులు... 
గత ఎన్నికల ముందు బెల్ట్‌షాపులన్నీ తొలగిస్తానంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. తొలి సంతకాల్లో బెల్ట్‌షాపుల రద్దును కూడా చేర్చారు. అసలు బెల్ట్‌ షాపులంటేనే అనధికారికంగా కొనసాగడం. అలాంటి అనుమతి లేని బెల్ట్‌షాపులు రద్దు అంటూ ప్రచారం కోసం ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప బెల్ట్‌షాపులు మాత్రం తగ్గలేదు.  బాబు హయాంలో జనరల్‌ స్టోర్స్, పాన్‌ షాపులు, సొంత నివాసాలు బెల్ట్‌ షాపులుగా మారాయి. జాతీయ రహదారులవెంట డాబాలు కూడా బెల్ట్‌షాపులుగా కొనసాగాయి. 

బాబు హామీలకే పరిమితం.. జగన్‌ చర్యలతో శ్రీకారం... 
ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అన్ని జిల్లాల్లో బెల్ట్‌షాపులపై మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. బెల్ట్‌షాపులు తమ కుంటుంబాలను నాశనం చేస్తున్నాయని, వాటిని తొలగించి తమ కుంటుంబాలను రక్షించాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బెల్ట్‌షాపుల తొలగింపుపై చర్యలను చేపట్టారు. అనుమతి లేని బెల్ట్‌ షాపుల రద్దుకు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకోగా జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు ఇవ్వకుండానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు కూడా బెల్ట్‌షాపుల తొలగింపుపై వెంటనే కార్యాచరణకు దిగారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడానికి నడుం బిగించారు. చంద్రబాబు హాయాంలో రాష్ట్రం వృద్ధి దేవుడెరుగు గానీ మద్యం, బీర్ల అమ్మకాల్లో ఏటా భారీగా వృద్ధి నమోదైంది. మద్యం విక్రయాల ద్వారా ఆర్జించిన సొమ్ము ప్రతీ ఏడాది పెరుగుతూనే పెరుగుతూనే ఉంది. 2014–15లో 11,569.65 కోట్ల రూపాలయ విలువైన మద్యం, బీరు అమ్మకాలు జరగగా, అది చంద్రబాబు పదవినుంచి దిగిపోయేనాటికి రూ. 20,128.42 కోట్లకు చేరిందంటే ఆయన ప్రజలను ఏ స్థాయిలో మద్యానికి బానిసలుగా చేశారో అవగతమవుతోంది. 

Advertisement
Advertisement