తుఫాన్లపై అప్రమత్తం | Sakshi
Sakshi News home page

తుఫాన్లపై అప్రమత్తం

Published Sun, Apr 3 2016 12:23 AM

alert  On Cyclones

విజయనగరం కంటోన్మెంట్: రానున్న రెండు నెలల్లో తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం కావాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సైక్లోన్ మిటిగేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికలు అందగానే అధికార బృందం విధుల్లో చేరాలన్నారు. తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఏడు తీర ప్రాంతాల్లో ఏడుగురు ప్రత్యేకాధికారులను, శాఖల వారీగా అధికారుల బృందాలను నియమించామన్నారు. వీరంతా ఆయా గ్రామాల్లో పర్యటించి తుఫాన్ల అప్రమత్తతను పరిశీలించాలని ఆదేశించారు.
 
 గత అనుభవాలను తెలుసుకుని సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులను ఆనుకుని ఉన్న రైలు మార్గాలు, రోడ్డు మార్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు గట్టు తెగినా, గండ్లు పడే అవకాశమున్నా మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ షెల్టర్ల మరమ్మతులకు రూ.కోటీ ఎనిమిది లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్, గైడ్స్ విద్యార్థుల ఫోన్ నంబర్లతో సహా జాబితాను సిద్ధం చేయాలని డీఆర్వోకు సూచించారు.
 
 రక్షిత నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు
 తాగునీటి సమస్య రాకుండా రక్షిత ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించాలన్నారు. నీటిని పంపింగ్ చేసేందుకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకుని బోట్లను సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్‌కు సూచించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సైక్లోన్ మిటిగేషన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
 అత్యవసర మందులు, ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓ, పౌరసరఫరాల అధికారులకు సూచించారు. విపత్తుల శాఖ నుంచి మంజూరయ్యే సామగ్రిని భద్రపరిచేం దుకు శాశ్వత స్టోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీకేశ్ బి లట్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, ఆర్డీఓలు ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్.గోవిందరావు, ఏఎస్‌పీ రమణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement