అన్నిటికీ సవరణలు.. ఓటింగ్ | Sakshi
Sakshi News home page

అన్నిటికీ సవరణలు.. ఓటింగ్

Published Fri, Jan 10 2014 4:31 AM

అన్నిటికీ సవరణలు.. ఓటింగ్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అన్ని క్లాజులకూ సవరణలు ప్రతిపాదించాలని, వాటిపై ఓటింగ్ కోరాలని కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతా చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకి స్తూ గట్టిగా తవు అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నారు. బిల్లుపై శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయుణ, శైలజానాధ్, వట్టి వసంతకుమార్, మహీధర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకటరావు, ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్ష చేశారు. బిల్లుపై సవరణల ప్రతిపాదనకు స్పీకర్  శుక్రవారం వరకు గడువు విధించినందున దానిపైనా సమాలోచన చేశారు. సీఎం మాట్లాడుతూ న్యాయనిపుణులతో చర్చించి సవరణల ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు.
 
 పార్టీల వారీగా స్పీకర్ సమయం కేటాయించనున్నందున ఆ మేరకు ఎంతవుందికి అవకాశం వస్తుందో అంతమందినే ఎంపిక చేస్తే సరిపోతుందని కొందరు మంత్రులు సూచించారు. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక బిల్లు అయినందున ప్రతి ఒక్క సభ్యుడు తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరముందని గాదె, పాలడుగు తదితరులు అభిప్రాయపడ్డారు. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ తరఫున సమగ్ర అభిప్రాయాలు వినిపించేందుకు కొందరి పేర్లను ప్రత్యేకంగా ఎంపికచేశారు. సభలో అభిప్రాయం చెప్పి వ్యతిరేకత వ్యక్తపరిస్తే చాలని, రాష్ట్ర విభజన బిల్లుకు అడ్డుకట్ట పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారని సమాచారం. తన అభిప్రాయం ఏమిటో చర్చలో పాల్గొన్నప్పుడు స్పష్టంగా చెబుతాన న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే మెజారిటీ రాదని, ఆ ప్రాంతంలోని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల సహకారం కూడా అవసరమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశానంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సవరణల ప్రతిపాదనలపై అడ్వొకేట్ జనరల్‌తో, మరికొందరు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు.

Advertisement
Advertisement