‘గంగ’ కోసం బెంగ | Sakshi
Sakshi News home page

‘గంగ’ కోసం బెంగ

Published Fri, Aug 9 2013 3:10 AM

all are waiting for water

 మైదుకూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని తెలుగుగంగ  ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతాంగం ఆందోళన చెందుతోంది. నీటి విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు నిరాశతో న్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీకి నీటిని విడుదల చేశారు. అయితే తెలుగుగంగ  ప్రాజెక్టుకు సాగునీరు విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
 దీంతో ఆయకట్టు రైతాంగంలో సందిగ్ధత నెలకొంది. గ తేడాది అరకొరగా నీరు విడుదల చేయడంతో పంటలు చేతికందక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడాదైనా ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నీటితో నింపి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
 
 వెలవెలబోతున్న రిజర్వాయర్లు
 జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందాలంటే శ్రీశైలం జలాశయమే ప్రధాన వనరు. చెన్నై తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ వారంలో 3వేల క్యూసెక్కుల నీటిని వెలుగోడు జలాశయంలోకి వదిలారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని సబ్సిడరీ రిజర్వాయర్-1, 2, బ్రహ్మంసాగర్ జలాశయాలకు నీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం సబ్సిడరీ రిజర్వాయర్-1లో పాతిక టీఎంసీ నీరు కూడా లేదు. సబ్సిడరీ రిజర్వాయర్-2లో అర టీఎంసీ నీరు నిల్వలేదు. ఇక బ్రహ్మంసాగర్ జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఈ రిజర్వాయర్ల కింద రమారమి 60వేల ఎకరాలు ప్రత్యక్ష, పరోక్షంగా ఆయకట్టు ఉంది. గతేడాది సబ్సిడరీ రిజర్వాయర్ 1,2లకే సాగునీరు చేరింది. బ్రహ్మంసాగర్ జలాశయానికి నీరు చేరి చేరక మునుపే నిలిచిపోయింది.
 
  శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు అధికంగా చేరుతుండడంతో పోతిరెడ్డిపాడు నుంచి 6వేల  క్యూసెక్కులకు పైగా నీటిని వెలుగోడుకు అందించాల్సిన అవసరం ఉంది. వెలుగోడు నుంచి జిల్లా సరిహద్దు వద్ద 2,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయగలిగితే సబ్సిడరీ రిజర్వాయర్1, 2, బ్రహ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నీరు చేరేందుకు 60రోజులు పడుతుంది. అయినా ఇంతవరకు నీటి  విడుదలపై స్పష్టమైన ప్రకటన లేదు. గతేడాది సక్రమంగా నీరు ఇవ్వనందున ఇప్పటికే రైతులు తిండిగింజలు లేక అల్లాడుతున్నారు. వెంటనే తెలుగుగంగకు నీరు వదిలి పంటలు వేసుకోవడానికి అనుమతివ్వాలని రైతాంగం కోరుతోంది.
 
 

Advertisement
Advertisement