మడకశిర డిపోలో అన్నీ డొక్కు బస్సులే.. | Sakshi
Sakshi News home page

మడకశిర డిపోలో అన్నీ డొక్కు బస్సులే..

Published Thu, Jan 8 2015 3:16 AM

మడకశిర డిపోలో అన్నీ డొక్కు బస్సులే..

ఆర్టీసీ డిపోపై అధికారుల చిన్నచూపు
 
మడకశిర: స్థానిక ఆర్టీసీ డిపో బస్సులంటే ప్రయాణికులు భయపడుతున్నారు. ఈ బస్సుల్లో ఎక్కితే క్షేమంగా గమ్యస్థానానికి చేరుకుంటామనే నమ్మకం ప్రయాణికుల్లో లేదు. ముఖ్యంగా మడకశిర ఆర్టీసీ డిపోకు ఇంతవరకు పూర్తి స్థాయి హోదా లభించలేదు.  హిందూపురం డిపోకు అనుబంధంగా కొనసాగుతోంది. పురం డిపో మేనేజరే ఈ డిపోకు కూడా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ డిపోపై పర్యవేక్షణ కొరవడింది. బస్సుల నిర్వహణ అధ్వానంగా మారింది.

ముఖ్యంగా ఈ డిపో పరిధిలో స్క్రాప్‌బస్సులను కూడా నడుపుతున్నారు. గతంలో రొళ్ల వద్ద ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు రెండు కూడా ఊడిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  ఇటీవల గంగులవాయిపాళ్యం వద్ద ఆర్టీసీ బస్సుఢీకొని ఓ ఇంటర్ విద్యార్థి వృతి చెందాడు. బస్సు కండీషన్‌లో ఈ ప్రమాదం జరిగేది కాదని తెలుస్తోంది.

డిపోలోని 75 శాతం బస్సులకు డోర్లు లేవు. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెనుకొండ ఘాట్‌లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు కండీషన్ కూడా అంతంత మాత్రమే. ఈ బస్సు 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్‌కు దాదాపుగా దగ్గరగా ఉంది. ఇలాంటి బస్సును ఘాట్ సెక్షన్‌లో నడపడానికి ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని  ప్రయాణికులు తప్పుపడుతున్నారు.  బాలేపల్లి, దొడ్డేరి తదితర సర్వీసులను విద్యార్థుల కోసమే నడుపుతున్నారు. ప్రతి రోజూ ఈ బస్సుల్లో వంద మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుంటారు.

ఈ బస్సులు ఏమాత్రం కండీషన్‌లో లేవు.   గతంలో ఈ డిపోకు కొన్ని కొత్తబస్సులను కేటాయించారు. త ర్వాత ఈ బస్సులను ఇతర డిపోలకు పంపారు. వీటి స్థానంలో డొక్కుబస్సులను ఈ డిపోకు పంపారు. డొక్కుబస్సులు లేకుండా చూడాలని ఆర్టీసీ యూనియన్లు గతంలో ఆందోళన కూడా చేశారు. అయినా కూడా ఆర్టీసీ అధికారులు చలనం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ డిపోకు కొత్త బస్సులను మంజూరు చేయించడంలో విఫలమవుతున్నారు.
 
ఇదిలా ఉండగా కొంత మంది డ్రైవర్లు బస్సులను నడపడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్లలో మాట్లాడటం, బానెట్‌పై ఇతరును కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కొంత మంది డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడిపిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలను అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు.

ఏదిఏమైనా మడకశిర డిపోలోని డొక్కుబస్సులు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటాయో చెప్పలేము. పెనుకొండ ఘాట్ ప్రమాద సంఘటన తోనైనా ఆర్టీసీ అధికారులు మేల్కొని కండీషన్ బస్సులు నడిపి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement