కాంగ్రెస్‌కు రాంరాం.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు రాంరాం..

Published Tue, Mar 11 2014 5:03 AM

all congress leaders says good bye to congress

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు
 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి పూర్తిగా కోల్పోవడంతో,  నేతలు ఇతర పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. ఏ పార్టీకి వెళితే తమకు మనుగడ ఉంటుందో అని ఆరా తీస్తున్నారు. అయితే వారు వెళ్లాలనుకుంటున్న పార్టీలు ఇప్పటికే ఫుల్ కావడంతో, ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే మార్గంలో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. సోమవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  కాంగ్రె స్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీ వైపునకు వెళ్లాలనే విషయంపై తన సహచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ కూడా నేడో, రేపో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన సోమవారం ఒంగోలు చేరుకుని, తన సహచరులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. ఈనెల 14వ తేదీన ఆయన ఏపార్టీలో చేరాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
 ఇప్పటికే రెండు పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండగా, ఒక పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.  ఇంకా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా పార్టీ వీడేందుకు  ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, తన సహచరులతో సమావేశం కావాల్సి ఉండగా, ఈ సమావేశాన్ని ఈనెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆయన ఒక పార్టీకి చెందిన ప్రముఖ నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అవసరమైతే ఆయన పార్లమెంటుకు పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఈనెల 12న సమావేశమయ్యాక, ఏపార్టీలో చేరతారనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
  మాజీ మంత్రి మహీధర్ రెడ్డి కూడా ఇతర పార్టీల వైపు  చూస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చినా ఆయన అటువైపునకు మొగ్గడం లేదని తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ వైపునకు రావాలనే ప్రయత్నంలో ఉండగా, కొందరు టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది. టీడీపీలోకి వచ్చే నాయకులకు ఆపార్టీ నేతలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు.
 
 

Advertisement
Advertisement