అంతా అధిష్టానుసారమే! | Sakshi
Sakshi News home page

అంతా అధిష్టానుసారమే!

Published Sun, Sep 29 2013 3:16 AM

అంతా అధిష్టానుసారమే! - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పైకి ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, నేతలు చివరకు అధిష్టానం బాటలోనే నడవాలన్న అభిప్రాయానికి వస్తున్నారు. శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్‌లో నేతల మధ్య చర్చలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ విషయమై శనివారం రోజంతా వరుస భేటీలు కొనసాగాయి. ఈ భేటీలన్నింటిలోనూ నేతల మాటతీరు వేర్వేరుగా ధ్వనించినా, అంతిమంగా అధిష్టానం బాటలోనే వెళ్లాలన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. విభజన అనివార్యంగా కనబడుతున్న దశలో కాంగ్రెస్‌లో కొందరు నేతలు తామే సీమాంధ్ర చాంపియన్లం కావాలంటూ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు! ‘‘విభజన నిర్ణయంతో అధిష్టానం తప్పు చేసింది. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతామని మనమంతా ముందే చెప్పినందున దాన్ని శిరసావహించక తప్పదు. విభజనతోవచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపమందాం. అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ముందే కేంద్ర మంత్రుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరదాం. అప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించిన వాళ్లమవుతాం. ఉద్యమం తగ్గుముఖం పడితే మనకూ వెసులుబాటు కలుగుతుంది’’ అన్న ఆలోచనకు నేతలు వచ్చారు. శనివారం వివిధ స్థాయిల్లో జరిగిన మంత్రుల సమావేశాలు ఇదే సారాంశంతో ముగిశాయి.
 
 కిరణ్ తీరుతో పార్టీకి నష్టమన్న బొత్స!
 సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం బాటలో వెళ్లాలన్న నిర్ణయానికి వస్తున్నా... వారిలో పలువురు తమకు తామే సమైక్యాంధ్రకు చాంపియన్లుగా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పరస్పరం తలపడుతున్నారు! ఆ దిశగా వారు ఎత్తులు పై ఎత్తులతో కదులుతున్నట్టు శనివారం నాటి పరిణామాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం విలేకరుల సమావేశంలో కిరణ్ చేసిన వ్యాఖ్యలు సమైక్య చాంపియన్‌గా నిలిచే ప్రయత్నాలేనని భావించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... సమైక్యం కోసం తాను మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు మీడియాకు లీకులిచ్చారు. దాంతో శనివారం ఉదయం నుంచీ కాంగ్రెస్‌లో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీఎం నివాసంలో కిరణ్‌తో బొత్స, మంత్రి కొండ్రు మురళి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. విభజన దిశగా అధిష్టానం కదలికలు, పార్టీ ముఖ్యనేతలుగా తాము మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వైఖరి తదితరాలపై చర్చ జరిగింది. మీడియాతో కిరణ్ వ్యాఖ్యలను బొత్స తప్పుబట్టినట్టు సమాచారం! అలా బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించేదిగా ఉందని ఆయనన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ఇలా చేయడం సరికాదంటూ ఆక్షేపించారు! ఇటీవల తాను ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసినప్పుడు చర్చించిన అంశాలను కూడా బొత్స వివరించారు. ‘‘ఎన్ని చెప్పినా వారు సమైక్యం తప్ప ఇంకేమైనా మాట్లాడమంటున్నారు. ఆంటోనీ కమిటీ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతారనుకుంటే ఆ పరిస్థితీ కన్పించడం లేదు. కేబినెట్ కు తెలంగాణ నోట్ వచ్చాక ఇక దాన్ని ఆపడం కష్టం. అసెంబ్లీ తీర్మానానికి కూడా అవకాశమిచ్చేలా లేరు. అసెంబ్లీకి వస్తే అడ్డుకుందామని  చూసినా ఫలితం ఉండదు. కేవలం అభిప్రాయం కోసం మాత్రమే అసెంబ్లీకి పంపిస్తారేమో. చర్చలో మనమేం చెప్పినా వాటిని ఆమోదించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. కాబట్టి ఈ తరుణంలో విభజన అనివార్యం.
 
  అప్పటిదాకా ఎదురుచూసే కన్నా ముందే రాజీనామా చేస్తే మన చేతుల మీదుగా విభజన జరిగిందన్న అపవాదుకైనా దూరంగా ఉండవచ్చు’’ అని బొత్స చెప్పినట్టు తెలుస్తోంది. కిరణ్ మాత్రం రాజీనామాలు చేస్తే మన అభిప్రాయాన్ని కూడా చెప్పలేమంటూ వ్యతిరేకించారు. తెలంగాణ అంశం అభిప్రాయం కోసమైనా అసెంబ్లీకి వస్తుంది గనుక అప్పుడు మన అభిప్రాయాలు చెప్పుకుందామని, సీమాంధ్ర సమస్యలకు పరిష్కారాల కోసం గట్టిగా పట్టుబడదామని అన్నట్టు తెలిసింది. అధిష్టానం ముందుకే వెళ్తున్నందున కిరణ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లి సోనియాను కలుద్దామని జేసీ ప్రతిపాదించగా, ఆమె అపాయింట్‌మెంటే ఇవ్వడం లేదు గనుక వెళ్లినా ఫలిత ముండదని ఇతరులన్నారు. రాజీనామాలు కాకుండా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేదాకా వేచి చూడాలని అభిప్రాయానికి వచ్చారు. త్వరలో కిరణ్ నేతృత్వంలో సీమాంధ్ర మంత్రులందరితో విస్తృతస్థాయి సమావేశం జరిపి దీనిపై తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించారు.
 
 బొత్స, ఆనం, రఘువీరా భేటీ
 కిరణ్ ‘సమైక్య చాంపియన్’ యత్నాలకు గండి కొట్టి ఆ క్రెడిట్‌ను దక్కించుకోజూస్తున్న బొత్స శనివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చాంబర్లో మంత్రులు రఘువీరారెడ్డి, బాలరాజు, కొండ్రులతో మంతనాలు జరిపారు. బొత్స తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆనంకు తెలిపారు. కానీ దానివల్ల ఫలితముండదని ఆనం అన్నారు. అధిష్టానాన్ని కించపరిచేలా కిరణ్ మాట్లాడటం సమంజసంగా లేదని బొత్స, ఆనం, రఘువీరా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కిరణ్ ఫ్లెక్సీలు వెలుస్తున్న వైనమూ చర్చకు వచ్చింది. కిరణ్ తీరుపై మంత్రులు తీవ్రంగా మండిపడినట్టు తెలిసింది. ‘‘తనొక్కడే చాంపియన్ అనిపించుకోజూస్తున్నారే తప్ప పార్టీలోని ఇతర నేతలను విస్మరించారు. ఇది నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు’’ అన్నారు.
 
 బొత్సకు అధిష్టానమే చెప్పింది: ఆనం
 విభజనపై అసెంబ్లీలో అభిప్రాయం తెలియజేయడమే తప్ప ఓటింగ్ ఉండకపోవచ్చని ఆనం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో అన్నారు. సీమాంధ్రకు సీఎం చాంపియన్ అయితే సీమాంధ్ర మంత్రులంతా కూడా చాంపియన్లేనన్నారు. ‘‘రెండు పదవుల్లో కొనసాగరాదని బొత్సకు అధిష్టానం చెప్పింది. పీసీసీ, మంత్రి పదవుల్లో దేన్ని వదులుకోవాలో ఆయన త్వరలో నిర్ణయించుకుంటారు’’ అని తెలిపారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చట్ట, న్యాయ పరిధిలోనే బెయిల్ వచ్చింది తప్ప దానితో కాంగ్రెస్‌కు ఎలాంటి సబంధమూ లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement