పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

Published Tue, Feb 26 2019 1:15 PM

All Set For Inter Exams PSR Nellore - Sakshi

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ) ఎస్‌ సత్యనారాయణ తెలిపారు.  స్టోన్‌హౌస్‌పేటలోని కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 49 ప్రభుత్వ, 41 ప్రయివేటు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులను అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. 26701 మంది ప్రథమ సంవత్సరం,  27981 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా నలుగురు ప్లయింగ్, ఐదుగురు సిటింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీరితో పాటు హైపవర్‌ కమిటీ, పరీక్షల కమిటీ సభ్యులు, అబ్జర్వర్‌ డీవీఈఓ వెంకయ్య పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

పరీక్షలకు 1252 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. వీరితో పాటు 18 మంది కస్టోడియన్స్‌ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంలోని మూడు కేంద్రాలు, రాపూరు, ఉదయగిరి, కోట, డక్కిలి, వెంకటగిరి, కావలి శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో  నాలుగుకు తగ్గకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు. చేజర్ల, సౌత్‌మెపూరులో సెల్ఫ్‌ సెంటర్లు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా బయటి వ్యక్తులను నియమించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు ఐపీఈ సెంటర్‌ లోకేటర్‌ యాప్‌ను గూగూల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచామన్నారు. హాల్‌ టికెట్‌లను జన్మభూమి యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఏమైనా కారణాలు చూపి విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకపోతే జూనియర్‌ కళాశాలల  యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్‌ పరీక్షల్లో ఇబ్బందుల తలెత్తితే కాల్‌సెంటర్‌ 0861 2320312 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. ఈ సమావేశంలో పరీక్షల బోర్డు కమిటీ సభ్యులు సురేష్‌బాబు, ఎస్‌పీ మౌలాలి, ఆర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement