ఏపీ అసెంబ్లీ ప్రసారాలపై హైకోర్టులో పిటిషన్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ ప్రసారాలపై హైకోర్టులో పిటిషన్‌

Published Tue, Aug 29 2017 1:33 PM

ఏపీ అసెంబ్లీ ప్రసారాలపై హైకోర్టులో పిటిషన్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు అక్రమంగా ఇచ్చారంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి, అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే.. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలువకుండా.. స్పీకర్‌ ఆదేశాల మేరకు అడ్వాన్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసార హక్కులను కట్టబెట్టారని తెలిపారు.

ఈ హక్కులను ఎలా ఇచ్చారనే ఆర్టీఐ చట్టం కింద తాను అడిగానని, అందులో స్పీకర్‌ ఆదేశాలమేరకు 2018 చివరివరకు నామినేషన్‌ ప్రాతిపదికన సమయభావం వల్ల అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థకు హక్కులు కేటాయించామని చాలా స్పష్టంగా చెప్పారని, కానీ, స్పీకర్‌ ప్రివిలేజ్‌ కిందకు ఇది రాదని చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయని ఆయన వివరించారు.  ఈ హక్కులు కేటాయించేందుకు టెండర్లు పిలువాల్సి ఉంటుందని, కానీ నిబంధనలను పక్కనబెట్టి అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థకు స్పీకర్‌ ఇచ్చారని తెలుస్తోందని ఆయన తెలిపారు. ప్రతిపక్షానికి, పాలకపక్షానికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ తన విధులను నిర్వర్తించకుండా.. తమ సభ్యుల గొంతులను నొక్కివేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కుల కేటాయింపులో క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆయన ఆరోపించారు.

అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థ వేమూరి రాధాకృష్ణ కొడుకు అయిన వేమూరి ఆదిత్యకు చెందినదని, ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా హైకోర్టు తెలియజేశామని చెప్పారు. ఏ విధమైన నిబంధనలు పాటించకుండా, టెండర్లు పిలువకుండా, కాంపిటేషన్‌ బిడ్డింగ్‌ లేకుండా ప్రసార హక్కులను కట్టబెట్టారని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. న్యాయస్థానం చాలా సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement