Sakshi News home page

'వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరింది'

Published Wed, Apr 1 2015 7:56 PM

'వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరింది' - Sakshi

హైదరాబాద్: నూతన రాజధానికి 'అమరావతి'  పేరును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరిందన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. చారిత్రక విశిష్టతలను కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఇంద్రుడు పాలించిన నగరంగా పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచారామాలలో ఒకటైన అమరావతిని కేంద్రప్రభుత్వం హెరిటేజ్ సిటీగా గుర్తించిందని చంద్రబాబు తెలిపారు. ఒకటో శతాబ్దంలో ధాన్యకటకం పేరుతో అమరావతిని శాతవాహనులు రాజధానిగా చేసుకొని పాలించారన్నారు. రాజా వాసిరెడ్డి 18 వ శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకొని ఉత్తమ పరిపాలన అందించారని చెప్పారు. అంతే కాకుండా బౌద్ధమతం తోనూ అమరావతికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు.

మచిలీపట్నాన్ని లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు 210 కిలోమీటర్లు వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఏపీ క్యాపిటల్ రీజియన్, రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్స్తో తయారవుతోందని చంద్రబాబు తెలిపారు. కృష్ణానదిపై దాదాపు 5 వంతెనలు నిర్మిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు సమాన స్థాయి వచ్చేంతవరకూ కేంద్రం ఇంకా సహకరించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కేవలం విభజన చట్టంలో ఉన్న అంశాలకేకాక మరిన్ని పనులు చేయాలని బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వచ్చే ఎన్నికల ముందే.. రాజధాని తొలిదశ పూర్తికావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్కు కొత్తపారిశ్రామిక విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలకు కావల్సిన విద్యుత్, నీళ్లు, భూములు ఇస్తామని చెప్పారు. అనుమతుల కోసం సింగల్ డెస్క్ను ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు 24గంటల కరెంటు ఇస్తామని ప్రకటించారు. అయితే యూనిట్ కరెంటుకు రూపాయి చొప్పున తిరిగి చెల్లిస్తామన్నారు. అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానశ్రయంగా చేస్తామని చెప్పారు. మంగళగిరిలో విమానశ్రయం ఏర్పాటు అంశం పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఏపీ నూతన రాజధాని నిర్మాణానికిగానూ మాస్టర్ప్లానర్గా వేరే ఏజెన్సీకి అప్పగిస్తామనీ, దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. విభజన చట్టం స్పూర్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఉండాలన్నారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని ఆయన సూచించారు. అప్పటికీ తీరకపోతే పెద్దమనుషులను పెట్టుకుందామని సలహా ఇచ్చారు. ఏపీనుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై తెలంగాణ సర్కారు అంతరాష్ట్ర పన్నులు విధించడం  సరికాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement