టీడీపీ నేతల్లో వణుకు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల్లో వణుకు

Published Sun, May 20 2018 12:34 PM

Amit Shah Conway TDP attack case Urban Police Prestige - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై జరిగిన టీడీపీ దాడిని తిరుపతి అర్బన్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనలో పాల్గొ న్న టీడీపీ ముఖ్య నాయకుల్ని విడతల వారీగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. దీంతో నగర టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు కలవరానికి లోనవుతున్నారు. కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే 15 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. ఘటనలో పాల్గొన్న 40 మంది టీడీపీ నాయకులు, వార్డు స్థాయి నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించుకుని వ్యక్తిగతంగా విచారణ జరుపుతున్నారు

సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి క్రైం : తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చిన అమిత్‌ షా ఈ నెల 11న ఉదయం దర్శనం పూర్తిచేసుకుని కొండ దిగుతుండగా అలిపిరి దగ్గర కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపారు. కాన్వాయ్‌లో ఉన్న బీజేపీ నేత కోలా ఆనంద్‌ కారు అద్దాలను పగులగొట్టి ఉద్రిక్తత సృష్టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి చేయ డం జాతీయ స్థాయిలో సంచలనమైంది. మరుసటి రోజు ప్రధాన పత్రికలన్నీ దాడి జరిగిన తీరును, బీజేపీ నేతల ఖండనలనూ ప్రముఖంగా ప్రచురించాయి. కేంద్ర ఇంటెలిజెన్సు ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమై తిరుపతి అర్బన్‌ పోలీసుల్ని నివేదిక కోరారు. 

జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుని కాన్వాయ్‌పై దాడి జరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఏపీ పోలీస్‌ బాస్‌లు ప్రశ్నించారు. దీంతో తిరుపతి అర్బన్‌ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అదే రోజున కాన్వాయ్‌ పై కర్రతో దాడికి పాల్పడిన సుబ్రమణ్యయాదవ్‌ అనే టీడీపీ నాయకుడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. అతనిపై కేసు నమోదు చేశారు. తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్పీ అభిషేక్‌ మొహంతి ఆధ్వర్యంలో అలిపిరి          సీఐ చంద్రశేఖర్‌ నాయకుల విచారణ కొనసాగిస్తున్నారు. 

సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా....
సంఘటన జరిగిన 11వ తేదీ అలిపిరి నిరసనలో పాల్గొన్న టీ డీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో టీటీడీ అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలు, మీడియా ప్రచురించిన ఫోటోలు, టీవీ ఛానళ్ల వీడియోలలో కనిపించిన నగర పార్టీ నేతల పేర్లను నమోదు చేసుకుని విడతల వారీగా స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌నాయుడు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, ఎమ్మెల్యే అల్లుడు సంజయ్‌లను ప్రధాన నాయకులుగా గుర్తించారు. వీరి నేతృత్వంలోనే పార్టీ కార్యకర్తలు ఆ రోజున నిరసనకు హాజరైనట్లు పోలీసులు సమాచారం తెప్పించుకున్నారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు దాడి జరిపేందుకు కర్రలు, రాళ్లు వాడారా లేదానన్న అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతి సమీక్షిస్తున్నారు. 

బాధ్యులపై కేసులు ఖాయం 
అమిత్‌ షా కాన్వాయ్‌లో వెనుక ఉన్న వాహనంపై కర్రతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యాన్ని ఆ రోజే అరెస్టు చేశాం. దాడికి దారితీసిన పరిస్థితులు, ఎవరెవరి పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే చాలా మందిని విచారించాం. నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. 
  – అభిషేక్‌ మొహంతి, అర్బన్‌ జిల్లా ఎస్పీ, తిరుపతి 

Advertisement
Advertisement