అమ్మ పోయి..అన్న | Sakshi
Sakshi News home page

అమ్మ పోయి..అన్న

Published Wed, Jul 2 2014 2:58 AM

అమ్మ పోయి..అన్న

 విజయనగరం కంటోన్మెంట్: గత ప్రభుత్వ పాలనలో అమ్మ హస్తం పేరిట పథకం ఏర్పాటు చేసిన రేషన్ లబ్ధిదారులకు తొమ్మిది సరుకులను అందిస్తున్న పథకం కాస్తా ప్రభుత్వ మారడంతో అన్నహస్తంగా మారనుంది. పసుపు రంగుతో కూడిన కూపన్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ప్రజలకు పంపిణీ చేయాల్సిన 9 రకాల సరుకుల పేర్లను ఉదహరిస్తూ  ఈ కూపన్లను పసుపు రంగులో ముద్రించారు.  రచ్చబండ రేషన్ కార్డుదారులకు కొత్తగా కూపన్లు మంజూరయ్యాయి.
 
 56, 382 కూపన్లను జిల్లాకు పంపించారు. ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పథకం పేరున ఈ కూపన్లను విడుదల చేశారు. మంగళవారం ఈ కూపన్లు జిల్లా కేంద్రానికి చేరాయి. కలెక్టరేట్‌లోని ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యాలయానికి చేరుకున్న ఈ కూపన్ల  వివరాలను డీఎస్‌ఓ ఇన్‌చార్జి హెచ్‌వి ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన కూపన్లు జూన్ నెల వరకూ మాత్రమే సరిపోయాయి. ఇప్పుడు పంపించిన కూపన్లు జూలై నుంచి వినియోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. కూపన్ల పరిశీలన పూర్తయ్యాక అన్ని మండలాల తహశీల్దార్లకూ పంపిస్తామని డీఎస్‌ఓ తెలిపారు.  
 
 త్వరగా పంపిణీ చేయండి:జేసీ రామారావు
 రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన కూపన్లను త్వరగా అందించాలని జాయింట్ కలెక్టర్ బి రామారావు సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చిన కూపన్లను ఆయన పరిశీలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement