టూరిజం హబ్‌గా మార్చుతా: సీఎం | Sakshi
Sakshi News home page

టూరిజం హబ్‌గా మార్చుతా: సీఎం

Published Fri, Jan 13 2017 3:34 AM

టూరిజం హబ్‌గా మార్చుతా: సీఎం - Sakshi

ఎయిర్‌ షోను ప్రారంభించిన చంద్రబాబు
వచ్చే నెలలో నేవల్‌ షో నిర్వహిస్తున్నట్టు వెల్లడి  


సాక్షి, విజయవాడ: అమరావతిని టూరిజం హబ్‌గా మార్చుతానని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రస్తుతం రూ.2.30 కోట్లతో ఎయిర్‌షో నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో నేవల్‌ షో నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమి ఘాట్‌ వద్ద మూడు రోజులపాటు జరిగే విమాన విన్యాసాల(ఎయిర్‌ షో)ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించే ధ్యేయంతో పవిత్ర సంగమం వద్ద ఉమెన్‌ పార్లమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఇక్కడ ఒక కార్యక్రమం జరిగేలా చూస్తామని చెప్పారు.

మన ప్రాంతం వారేగాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు ఇక్కడికొచ్చి కార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గన్నవరంలో చక్కటి ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను పౌరవిమానశాఖ నిర్మించిందని, రాబోయే రోజుల్లో మరో ట్రాన్సిట్‌ టెర్మినల్‌ నిర్మాణం జరుగుతుందని వివరించారు. రన్‌వేను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు.  ఈ సందర్భంగా పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన విమానాల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కృష్ణానదిని, ఆకాశాన్ని తాకుతూ సాగిన విన్యాసాలను చూసి అబ్బురపడ్డారు.

Advertisement
Advertisement