అనంత లాస్ట్ | Sakshi
Sakshi News home page

అనంత లాస్ట్

Published Wed, Apr 20 2016 3:47 AM

Anantapuram 'Party situation Chandra babu confusions

పార్టీ పనితీరు ఆధారంగా జిల్లాలు,
ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించిన టీడీపీ అధిష్టానం
ఆఖరిస్థానంలోనిలిచిన అనంత
వ్యక్తిగతంగా నంబర్ వన్ ర్యాంకులో వరదాపురం..
చివరన పయ్యావుల  
అనంత’లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు కలవరం

 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం ఇద్దరు ఎంపీలు.. 12 మంది ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ‘అనంత’ది మొదటిస్థానమంటూ ఆ పార్టీ నేతలు ఇన్నాళ్లూ చంకలు గుద్దుకున్నారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు కూడా ‘టీడీపీకి అనంతపురం కంచుకోట’ అని గొప్పలు చెప్పుకున్నారు. అయితే.. సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోలిస్తే ‘అనంత’లో టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని అధిష్టానమే తేల్చింది. పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో ‘అనంత’కు ఆఖరి స్థానం కేటాయించింది.  ‘అనంత’ ఆఖరిస్థానంలో నిలవడంపై ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పాటు సీఎం చ ంద్రబాబు కూడా కలవరపాటుకు గురయ్యారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ‘అనంత’లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేలిపోయింది.
 ఇసుక కుంభకోణాలు, అధికారులపై దాడులు, బదిలీల్లో మామూళ్లు, పింఛన్లలో అక్రమాలు.. ఇలా ఒకటికాదు.. రెండు కాదు ప్రతి సంక్షేమ పథకంలోనూ టీడీపీ నేతలు బరితెగించి దోచుకున్నారు.

పోలీసు శాఖను చెప్పుచేతుల్లో ఉంచుకుని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారు. వీటన్నిటిపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.  టీడీపీ అధిష్టానం సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలకు ర్యాంకులు ప్రకటించింది. పనితీరు ఆధారంగా కేటాయించిన ఈ ర్యాంకుల్లో అనంతపురం చివరిస్థానంలో నిలిచింది. జిల్లాలో పార్టీ పనితీరును బేరీజు వేసి వందకు 54.36 మార్కులు వేశారు. ప్రెస్‌మీట్‌లు, పార్టీ సమావేశాల నిర్వహణను పరిగణనలోకి తీసుకుని 50.29 శాతం గ్రేడింగ్ ఇచ్చారు.
 
 ప్రాతిపదిక ఇదే
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు టీడీపీ అధిష్టానం ర్యాంకులు ఇచ్చేందుకు రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. గ్రామస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? మండలస్థాయిలో పార్టీ పనితీరు ఎలా ఉంది? అనే అంశాలనే పరిశీలించి గ్రేడింగ్‌లు ఇచ్చారు. ఈ గ్రేడింగ్‌ల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. పార్టీ నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు హాజరైన శాతాన్ని లెక్కించారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఏ మేరకు పూర్తి చేశారు, మూన్నెళ్లకోసారి ఆ కమిటీలతో సమావేశాలను నిర్వహించారా అనే విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు.  
 
 ఎన్నికలొస్తే ఫలితాలు తారుమారు
‘అనంత’లో పార్టీ పనితీరుపై కొందరి ముఖ్యనేతల వద్ద చంద్రబాబు అసహనాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. ‘ఉరవకొండ, కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ఎక్కడా మండల కమిటీలను ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గస్థాయిలో గతేడాది ఆగస్టు నుంచి మార్చి వరకూ ఉరవకొండ, అనంతపురం నియోజకవర్గాల్లో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మరో ఐదు చోట్ల ఒక్కో సమావేశం నిర్వహించారు. పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో పరిటాల సునీత 8, పల్లె 11వ ర్యాంకు దక్కించుకున్నారు. వీరితో పాటు చాలామంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రమూ ఆశాజనకంగా లేదని, వర్గపోరు, అక్రమ సంపాదనతో పార్టీ పరువు తీస్తున్నారని మండిపడినట్లు తెలుస్తోంది. ‘అనంత’ అంటే తనకు భరోసా ఉండేదని, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Advertisement
Advertisement