మీసం మెలేస్తే తాట తీస్తా | Sakshi
Sakshi News home page

మీసం మెలేస్తే తాట తీస్తా

Published Fri, Jan 24 2014 8:50 AM

సీఐ గోరంట్ల మాధవ్ - Sakshi

 అనంతపురం : రౌడీషీటర్లు రోడ్లెక్కి మీసం మెలేస్తే తాట తీసేందుకు పోలీసులు కూడా ఉన్నారని వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. గురువారం వన్‌టౌన్ పరిధిలోని 15 మంది రౌడీషీటర్లను ఆయన స్టేషన్‌కు పిలిపించారు. తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, జాగ్రత్తగా మసలుకోవాలని వారికి సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీషీటర్ల ఆగడాలకు కళ్లెం వేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని, తోక జాడిస్తే చూస్తూ ఊరుకోనన్నారు.
 
 రౌడీషీటర్లు వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తడం, వ్యాపారులకు అండగా ఉంటూ సామాన్యులపై భౌతికదాడులకు దిగడం, కాలనీల్లోకి ప్రజలను భయాందోళనకు గురి చేయడాన్ని తక్షణం మానుకోవాలన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీ ముసుగులో చేరి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరన్నారు. చట్ట పరిధిలో ప్రతి రౌడీషీటర్‌పై చర్యలు ఉంటాయన్నారు. కష్టపడి సంపాదిస్తేనే ఎవరి జీవితానికైనా సార్థకత ఉం టుందని హితవు పలికారు. అలా కాకుండా నాలుగు సెటిల్‌మెంట్లు చేసి స్థిరపడాలని చూస్తే అంతకంత అనుభవించక తప్పదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్‌కు పోలీసుల నుంచి పి లుపు రాగానే హాజరుకావాలన్నారు. తప్పించుకుని తిరిగి తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
 
 రౌడీషీటర్ ఆనంద్ అరెస్ట్  
 రాజమ్మనగర్‌కు చెందిన దంపతులపై ఆధిపత్యం కొనసాగిస్తూ.. అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతూ వేధించిన కేసులో రౌడీషీటర్ ఆనంద్‌ను అరెస్ట్ చేశామని, రిమాండ్‌కు తరలించనున్నామని సీఐ గోరంట్ల మాధవ్ తెలి పారు. పలు కాలనీల్లో అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సామాన్యుల నెత్తురు, మాంసాలను పీక్కుతింటున్న ఆనంద్‌పై గతంలో పలు మార్లు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అయితే అతడు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుండడంతో గాలిస్తూ వచ్చామన్నారు. యాధృచ్చికంగా దంపతులపై దాడి చేసేందుకు కుట్ర పన్నడం, అదే సమయంలో బాధితురాలు షహనాజ్ పోలీసులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో  పట్టుకున్నట్లు తెలిపారు.   
 

Advertisement
Advertisement