నిధులుండీ సాగని బండి | Sakshi
Sakshi News home page

నిధులుండీ సాగని బండి

Published Wed, Aug 5 2015 1:31 AM

And there were funds to cart sagani

పుష్కరాలు పూర్తయినా ఆ పేరిట ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. జిల్లా కలెక్టర్.. అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొన్ని పనులను ఆదరాబాదరాగా పూర్తి చేశారు. దీంతో నాణ్యత కొరవడి పుష్కరాలకు వచ్చిన భక్తులు అవస్థలు పడ్దారు కూడా. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉండగా నత్తతో పోటీ పడుతున్నాయి.
 
 ఏలూరు (టూటౌన్) : గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల ద్వారా రూ.506 కోట్లు ప్రభుత్వం కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించినప్పటికీ పుష్కరాల పూర్తయినా పనులు పూర్తి కాలేదు. సుమారు రూ. 100 కోట్లు నిర్మాణ దశలోనూ, ప్రారంభ దశలోనే ఉన్నాయి. పుష్కరాలు ముగిసి 10 రోజులు అయినప్పటికీ  నిర్మాణాలు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, దేవాదాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖతో పాటు నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు మునిసిపాటిటీలకు కోట్లాది రూపాయలు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించింది. అయితే కొన్ని శాఖల్లో టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం, కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకపోవడం, మరికొందరు కాంట్రాక్టర్లు టెండర్లు వేసినప్పటికీ అగ్రిమెంట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు ప్రారంభించకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అభివృద్ధి పనులు మాత్రం జరగలేదు.
 
 అన్ని శాఖలదీ అదే తీరు
 ఆర్‌అండ్‌బీ శాఖకు ప్రభుత్వం రూ. 305 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించగా కేవలం రూ. 220 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. మరో రూ. 85 కోట్ల పనులు ఇంకా అసంపూర్తిగాను, నిర్మాణానికి నోచుకోని పరిస్థితుల్లోను ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.  56.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసి 287 పనులు చేయాలని నిర్ణయించినప్పటికీ వాటిలో 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు రహదారుల నిర్మాణం సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
 
 దేవాదాయ శాఖ ద్వారా రూ. 13.68 కోట్లు కేటాయించగా కేవలం నమూనా దేవాలయాలను మాత్రమే నిర్మించి మిగిలిన పనులు అసంపూర్తిగానే వదిలివేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు రూ.2.94 కోట్లు ప్రభుత్వం కేటాయించగా చాలాచోట్ల పైపులైన్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. పుష్కరాలకు సంబంధించి పలుచోట్ల బోర్లు వేయాలని నిర్ణయించినప్పటికీ అది కూడా పూర్తిస్థాయిలో అధికారులు చేపట్టడంలో విఫలమయ్యారు. కొవ్వూరు మునిసిపాలిటీలో రూ. 44.48 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ  పనులు పూర్తి కాకపోగా పుష్కరాలు పూర్తయి పది రోజులు అయినప్పటికీ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. పాలకొల్లు మునిసిపాలిటీకి రూ. 12 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ అక్కడ కూడా అసంపూర్తిగానే పనులు జరిగాయి. నరసాపురం మునిసిపాలిటీకి రూ. 44 కోట్లు కేటాయించి వివిధ రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. నరసాపురం నుంచి భీమవరం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డును రూ. 28 కోట్లతో మొదలు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
 
 పుష్కరాలు అయిపోయాయనే ధీమాతో ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిధులున్నా అభివృద్ధి పనులు జరిగే అవకాశం కనపడటం లేదు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కె. భాస్కర్ పుష్కరాల సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడంతో రూ. 400 కోట్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. అయితే ఆ పనుల్లో కూడా నాణ్యత కొరవడటంతో పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పుష్కరాల నిధులతో చేపట్టాల్సిన పనులను కాంట్రాక్టర్లు ఇంతవరకు  ప్రారంభించకపోవడంతో వాటిని రద్దు చేసే దిశగా అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. కాగా జిల్లాలోని 97 పుష్కర ఘాట్‌ల్లో అభివృద్ధి పనులు ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఆయా శాఖలకు సంబంధించిన పుష్కరాల పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement