టిడిపిలో అంతర్మథనం | Sakshi
Sakshi News home page

టిడిపిలో అంతర్మథనం

Published Sun, Nov 2 2014 3:27 AM

Andarmathanam country

 సాక్షి ప్రతినిధి, గుంటూరు
 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అంతర్మథనం ఆరంభమైంది. మిత్రపక్షం బీజేపీ వ్యవహారశైలి, పార్టీ, ప్రభుత్వపరంగా గుర్తింపు లభించక పోవడంతో అధికారం వచ్చిన సంతోషం నేతల్లో కనిపించడం లేదు. పదేళ్లుగా పార్టీని బతికించుకోడానికి పడిన కష్టాలన్నీ తొలగిపోతాయని భావించిన నేతలకు భిన్న పరిస్థితులు ఎదురవుతుంటే కలత చెందుతున్నారు.

  పార్టీ అధికారంలో ఉందో ప్రతిపక్షంలో ఉందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలు, పార్టీ సమావేశాల్లో ఇదే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బిజీబిజీగా ఉంటున్నారే కాని తమ సమస్యలు అర్థం చేసుకోవడం లేదని, అసలు దర్శన భాగ్యమే లభించడం లేదంటున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు.

  జిల్లాలో బలపడేందుకు మిత్రపక్షం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా టీడీపీ నేతలను కలవర పెడుతున్నాయి.
  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడాన్ని టీడీపీ ముఖ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
   అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని బద్ధ శత్రువుగా చూసిన కన్నాతో ఇప్పుడెలా మైత్రీ బంధం కొనసాగించాలో అర్థం కావడం లేదంటున్నారు.

  రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతుండటంతో జిల్లాలోనూ కన్నా చుట్టూ అధికారం కేంద్రీకృతమౌతుందనే భయం వారిని వెన్నాడుతోంది.

  రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయరు పదవి తమకు కావాలం టూ బీజేపీ నేతల డిమాండ్‌కు కన్నా చేరిక మరింత బలం చేకూర్చుతుందనే భావన వ్యక్తం అవుతోంది.

   ఇటీవల పార్టీలో చేరిన తాడిశెట్టి మురళీకి కన్నాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో మేయరు పదవిని బీజేపీ డిమాండ్ చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలంటున్నారు. వీరి చేరికతో మేయరు పదవిపై టీడీపీ ఆశలు ఆవిరవుతున్నాయి.

  అధికారం వచ్చి ఆరు నెలలైనా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు లభించకపోవడంతో సీనియర్లు, కార్యకర్తలు మధనపడుతున్నారు. మండల స్థాయి అదికారులు కూడా తమ మాట ఖాతరు చేయడం లేదని, వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు.

  మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులకు కీలక శాఖలు ఉండటంతో జిల్లా కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కనీసం ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నేతలు తల్లడిల్లిపోతున్నారు.

   జిల్లాలో సొంత కార్యాలయాలు, సమస్యల పరిష్కారానికి బాధ్యులను ఏర్పాటు చేయకపోవడంతో వారి పట్ల పార్టీలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.

  ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్టీ సమావేశాల్లో టీడీపీ నేతలు తమ ఆవేదనను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement