‘పాలెం’ దుర్ఘటనకు ఆ నలుగురే బాధ్యులు | Sakshi
Sakshi News home page

‘పాలెం’ దుర్ఘటనకు ఆ నలుగురే బాధ్యులు

Published Sat, Jan 11 2014 4:53 AM

‘పాలెం’ దుర్ఘటనకు ఆ నలుగురే బాధ్యులు

సాక్షి, హైదరాబాద్: పాలెంలో వోల్వో బస్సు దుర్ఘటనకు బెంగళూరులో అరెస్ట్ చేసిన షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలే కారణమని సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ యజమానితోపాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా.. గురువారం రాత్రి బెంగళూరులో షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్‌పీ నోముల మురళీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వీరిని బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. వీరిలో అక్రం వోల్వో బస్సుకు మె యింటెనెన్స్, షబ్బీర్ కార్గో పనులు చూస్తుండగా, అమానుల్లా, రజాక్ టికెట్‌లు ఇచ్చే వారని తేలింది. వీరిపై సీఆర్‌పీసీలోని సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేశారు.
 
  బస్సులో 39 మంది ప్రయాణికులను ఎక్కించాల్సి ఉండగా.. వీరు అత్యాశకు పోయి 52 మందిని ఎక్కించారని సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం ‘సాక్షి’తో చెప్పారు. షబ్బీర్ నిబంధనలకు విరుద్ధంగా మండే గుణం ఉన్న వస్తువులను కూడా బస్సులో చేర్చినట్లు తేలిందన్నారు. మెయింటెనెన్స్ చూసే అక్రం, బస్సులో ఎమర్జెన్సీ డోర్ సక్రమంగా పని చేస్తుందా లేదా అనేది తనిఖీ చేయలేదన్నారు. అలాగే బస్సులో ఉండాల్సిన ఎమర్జెన్సీ హ్యామర్స్‌ను ఉంచలేదని, ప్రమాదం జరిగితే బస్సు అద్దాలను పగులగొట్టి వెలుపలికి ఎలా రావాలో జాగ్రత్తలను ప్రయాణికులకు సూచించలేదని ఆయన వివరించారు. బస్సు ప్రమాదానికి వీరు నేరుగా బాధ్యులు కాకపోయినా.. నిబంధనలు పాటించకపోవడంతో ఈ దుర్ఘటనకు వీరు సహకరించినట్లు అయ్యిందన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ముగియలేదని, ఎవరెవరు బాధ్యులనే దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Advertisement
Advertisement