పునర్విభజన ఇప్పట్లో లేదా? | Sakshi
Sakshi News home page

పునర్విభజన ఇప్పట్లో లేదా?

Published Fri, Jun 27 2014 8:49 PM

పునర్విభజన ఇప్పట్లో లేదా? - Sakshi

* ఆంధ్రప్రదేశ్‌లో 225కు పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిపోయింది. కొత్త ప్రభుత్వాలూ కొలువుదీరాయి. దీంతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడో తేలకపోవడం, రాజధాని ఎక్కడో తేలితే అక్కడికి వలసలు పెరగడం, ఏటేటా జరిగే ఓటర్ల జాబితాల్లో సీమాంధ్రలో భారీ మార్పులు చోటుచేసుకోవడం, ఉద్యోగుల కేటాయింపు పూర్తి కాకపోవడం వంటి అనేక చిక్కుముడుల కారణంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఇప్పట్లో చేపట్టే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 119 స్థానాలుండగా, వీటిని 153కి, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచుతూ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.

గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో 2025 వరకు దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. ఏపీలో 25, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు సంఖ్యాపరంగా యథాతథంగా కొనసాగుతాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో ఇరు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్య మాత్రమే మారనుంది. ఈ స్థానాల సంఖ్య పెరిగితే లోక్‌సభ స్థానాల భౌగోళిక స్వరూపంలోనూ మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో సుమారు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

పునర్విభజన జరిగితే ఏపీ, తెలంగాణల్లోని ప్రతి లోక్‌సభ పరిధిలోకి 9 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. అంతేకాకుండా, రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ మార్పులు జరుగుతాయి. సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజనకు పార్లమెంటు ప్రత్యేక కమిషన్‌ను నియమిస్తుంటుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణల్లో చేపట్టాల్సిన పునర్విభజన ప్రక్రియ బాధ్యతను పార్లమెంటు కేంద్ర ఎన్నికల సంఘానికే అప్పగించింది. ఇందులో లోక్‌సభ, శాసన సభల నుంచి అయిదుగురు చొప్పున ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇతర నిబంధనలన్నీ పాతవే ఉంటాయి. అయితే,పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటిలోగా ముగించాలన్న విషయంపై రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎలాంటి స్పష్టత  ఇవ్వలేదు.

చాలా సమయముంది
రాష్ట్ర విభజన జరిగి ఇరవై రోజులు దాటినప్పటికీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం ఇప్పుడే చేపట్టే అవకాశం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతంలో చేపట్టిన పునర్విభజన ప్రక్రియను 2004 ఎన్నికలు పూర్తయ్యాక చేపట్టి 2009 ఎన్నికల నాటికి ముగించారు. 2009 నాటి సాధారణ ఎన్నికలు కొత్త నియోజకవర్గాల్లో జరిగాయి. అప్పట్లో రాష్ట్రం సమైక్యంగా ఉండడం, ప్రత్యేక కమిషన్‌కు బాధ్యతలు అప్పగించడంతో కార్యక్రమం సాఫీగా సాగింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతను ఎన్నికల సంఘానికే అప్పగించడం, అనేక ప్రతిబంధకాలు ఉండటంతో కొంత ఆలస్యంగానే దీన్ని చేపడుతుందని చెబుతున్నారు.

పునర్విభజన క్లిష్టతరమైనది కావడంతో ఉద్యోగులు.., ముఖ్యంగా రెవెన్యూ విభాగం దీనిలోనే నిమగ్నం కావలసిన అవసరముంటుంది. అయితే, రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోపక్క, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో  ఎన్నికల సంఘం నిమగ్నమైంది. పునర్విభజన కారణంగా నియోజకవర్గాల భౌగోళిక స్వరూపంలో మార్పు జరిగి కొన్ని ప్రాంతాలు కొత్త నియోజకవర్గాల పరిధిలోకి వెళతాయి. దీనివల్ల ఆ ప్రాంతాలపై  ప్రస్తుత ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం ప్రదర్శించే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. కొత్త నియోజకవర్గంగా ఏర్పడే ప్రాంతాలకు ప్రాతినిథ్యం లేక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

మరో సాంకేతిక అంశమేమంటే.. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిటీలో రాష్ట్రాల ఎన్నికల సంఘాల (స్టేట్ ఎలక్షన్ కమిషన్) కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇంకా విభజించలేదు. తెలంగాణకు ప్రత్యేంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌నే ఇరు రాష్ట్రాల ప్రతినిధిగా పరిగణించడానికి వీలుకాదు. ఇందుకు రెండు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయి. తెలంగాణకు ప్రత్యేక ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు ఈ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల లోపు ఓటర్లున్న స్థానాలు 86 ఉండగా, 2 లక్షలకు పైన ఓటర్లున్న స్థానాలు 89 ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియలో పది శాతం తేడాతో నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. అయితే ఏటేటా చేపట్టే ఓటరు నమోదు కార్యక్రమంతో పాటు సీమాంధ్ర కొత్త రాజధాని చుట్టూ కొంత మేరకు వలసలు పెరిగే అవకాశాలు ఉండటాన్ని కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే భౌగోళికంగా మార్పులు వస్తాయి. ఈ కారణాల వల్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో చేపట్ట అవకాశాల్లేవని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

హెచ్చ తగ్గులనూ సవరించాలి
 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. రాష్ట్రం మొత్తం జనాభా సంఖ్యను నియోజకవర్గాల సంఖ్యతో విభజించి నియోజకవర్గ జనాభా సంఖ్యను నిర్ణయిస్తారు. పరిపాలన విభాగాలు, భౌగోళికమైన అనుకూల, ప్రతికూలాంశాలను కూడా పరిగణనలోకి తీసుకొంటారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మండలాలు, పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లను కొంత భాగం ఒక నియోజకవర్గంలో, మరికొంత భాగం మరో దానిలో పోకుండా ఒకేదానిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా చేసినప్పుడు 10 శాతం జనాభా తగ్గింపు, పెంపులకు అవకాశమిచ్చారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో జనాభా సరిసమానంగా కాకుండా హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. పట్టణప్రాంతాల్లో జనాభా పెరుగుదలతో ఆ వ్యత్యాసం మరింత పెరిగింది. ఇప్పుడా హెచ్చుతగ్గులను కూడా సవరించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై గందరగోళం
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ మార్పులు వస్తాయి. నియోజకవర్గాల్లో చేరే మండలాలను అనుసరించి రిజర్వ్ చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన-2002కు ముందు సమైక్య రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 6 ఎస్సీలకు 2 ఎస్టీలకు కేటాయించారు.  సీమాంధ్రలోని అమలాపురం, నెల్లూరు, తిరుపతి స్థానాలు, తెలంగాణలోని నాగర్‌కర్నూల్, సిద్ధిపేట, పెద్దపల్లి నియోజకవర్గాలు ఎస్సీలకు వచ్చాయి.  సీమాంధ్రలోని పార్వతీపురం, తెలంగాణలోని భద్రాచలం ఎస్టీలకు రిజర్వయ్యాయి. 

2001 జనాభా లెక్కల ప్రకారం జరిగిన పునర్విభజన-2002 ప్రకారం ఎస్సీల స్థానాలు ఏడుకు, ఎస్టీల స్థానాలు మూడుకు పెరిగాయి. ఎస్సీలకు ఆంధ్రలో ఒకటి, ఎస్టీలకు తెలంగాణలో ఒకటి అదనంగా వచ్చాయి. సీమాంధ్రలోని అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, తెలంగాణలోని పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్ స్థానాలు ఎస్సీలకు వచ్చాయి. ఎస్టీ స్థానాల్లో సీమాంధ్రలోని అరకు, తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబాబాద్‌లు చేరాయి.

అసెంబ్లీ స్థానాల్లో...
నియోజకవర్గాల పునర్విభజన-2002కు ముందు సమైక్య రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో  39 ఎస్సీలకు, 15 ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.  ఎస్సీ కేటగిరీలోని స్థానాల్లో 18 తెలంగాణలో, 21 సీమాంధ్రలో ఉన్నాయి.  ఎస్టీ కేటగిరీలోని స్థానాల్లో 8 తెలంగాణలో, 7 సీమాంధ్రలో ఉన్నాయి.  పునర్విభజన-2002 తరువాత ఎస్సీల స్థానాలు 48కు, ఎస్టీల స్థానాలు 19కి పెరిగాయి.  ఎస్సీ కేటగిరీలోని 48 స్థానాల్లో 19 తెలంగాణలో, 29 సీమాంధ్రలో ఉన్నాయి. ఎస్సీలకు తెలంగాణలో ఒకే స్థానం పెరగ్గా, సీమాంధ్రలో 8 స్థానాలు పెరిగాయి.  ఎస్టీ కేటగిరీలోని 19 స్థానాల్లో 11 తెలంగాణలో, 8 సీమాంధ్రలో ఉన్నాయి. ఈ వర్గానికి తెలంగాణలో మూడు, సీమాంధ్రలో ఒకటి అదనంగా పెరిగాయి.
 
పునర్విభజన జరిగితే...
అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన జరిగితే 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్నందున రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఆమేరకు జనరల్ స్థానాల సంఖ్య భారీగా తగ్గనుంది. 13 జిల్లాల తో కూడిన ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 38, ఎస్టీలకు 14 స్థానాలు రిజర్వు కానున్నాయి. గతంతో పోలిస్తే ఎస్సీలకు 9, ఎస్టీలకు 4 స్థానాలు పెరుగుతాయి.

Advertisement
Advertisement