యూపీఎస్సీతో ఏపీ సీఎస్ భేటీ | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీతో ఏపీ సీఎస్ భేటీ

Published Tue, Jul 22 2014 2:55 AM

Andhra Pradesh chief secretary meets UPSC

నూతన డీజీపీ ఎంపికపై కసరత్తు

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న జె.వి. రాముడు ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాముడును మరో రెండేళ్లపాటు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారు. డీజీపీ పదవికి ఎంపిక చేసిన అధికారిని రెండేళ్ల పాటు ఆ పదవీలో కొనసాగింప చేయాలని, ఇందుకు పదవీ విరమణతో సంబంధం లేకుండా చేయాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించకుండా పదవీ విరమణ చేస్తే రెండేళ్ల పాటు వర్తించదని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీలైనంత వరకు రాముడు కొనసాగింపునకు కృష్ణారావు ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించని పక్షంలో మరో ఐపీఎస్ సీనియర్ అధికారి అరుణా బహుగుణను తాత్కాలిక డీజీపీగా నియమించేందుకు అనుమతించాలని ఆయన కోరనున్నారు. బహుగుణ ప్రస్తుతం జాతీయ పోలీసు అకాడమీలో పనిచేస్తున్నారు. ఆమె తెలంగాణకు చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తి అయ్యే వరకు బహుగుణను ఏపీ డీజీపీగా నియమించాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. మరోపక్క, సీనియారిటీ ప్రకారం డీజీపీ పోస్టుకు పది మంది పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసులో ఉన్న అధికారుల పేర్లతో ఈ జాబితాను రూపొందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement