అసోంలో కిడ్నాప్‌నకు గురైన ఇంజినీర్ అంకమ్మరావు | Sakshi
Sakshi News home page

అసోంలో కిడ్నాప్‌నకు గురైన ఇంజినీర్ అంకమ్మరావు

Published Tue, Dec 24 2013 3:47 AM

andhra pradesh engineer kidnapped in assam

   కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
     తమ కుమారుడిని విడిచి పెట్టాలంటూ వేడుకోలు
     తన భర్తకు ఏ పాపం తెలియదంటున్న భార్య వాణి
 
 బతుకుదెరువు కోసం కన్నవారిని, భార్యాబిడ్డలను వదిలి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఇంజినీరు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. డబ్బు ఆశతోనో..మరేదైనా కారణమో తెలియదు కానీ తీవ్రవాదులు అపహరించుకెళ్లారు. వారం కిందట తమ మధ్య ఆనందంగా గడిపి వెళ్లిన వ్యక్తి ఇలా పరాయిప్రాంతంలో ఆపదలో చిక్కుకున్నాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. అసోంలో బోడో తీవ్రవాదుల చేతిలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన యద్దనపూడి మండలం జాగర్లమూడికి చెందిన అంకమ్మరావు జాడ తెలియక అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
 
 యద్దనపూడి, చీరాల, న్యూస్‌లైన్:
 ఉద్యోగం కోసం ఊరుకాని ఊరు వెళ్లిన తన భర్తను తీవ్రవాదులు అపహరించుకెళ్లారనే పిడుగులాంటి వార్త విన్న అతని భార్య నిర్ఘాంతపోయింది. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపివెళ్లిన వ్యక్తి ఆపదలో ఉన్నాడని తెలిసి కన్నీరు మున్నీరవుతూ తన భర్తను ఎలాగైనా కాపాడాలని వేడుకొంటోంది. యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి గ్రామానికి చెందిన అంకమ్మరావు(36) హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొల్లినేని శీనయ్య నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అసోంలో జరుగుతున్న పవర్ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని వస్తున్న సమయంలో
 బోడోల చెరలో..
 
 బోడో తీవ్రవాదులు అతడిని అపహరించుకు వెళ్లారు. సంఘటన సమాచారాన్ని కంపెనీ ప్రతినిధులు అంకమ్మరావు భార్యకు ఫోన్‌ద్వారా అందించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  
 
 అంకమ్మరావు కుటుంబ నేపథ్యమిదీ...
 జాగర్లమూడికి చెందిన బత్తుల చిన్నబ్బాయి, బంగారమ్మలకు ఆరుగురు సంతానం. అంకమ్మరావు ఆఖరివాడు. చిన్నబ్బాయి అన్న దంపతులు వెంకటేశ్వర్లు, మంగమ్మలు అతడిని దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న అంకమ్మరావు గుంటూరులో పాలిటెక్నిక్ విద్యనభ్యసించాడు. పదేళ్ల నుంచి నిర్మాణ రంగంలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి అసోంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అంకమ్మరావుకి భార్య వాణి, పిల్లలు అనిల్, అనూష ఉన్నారు. ఒకరు ఐదో తరగతి, మరొకరు మూడో తరగతి చదువుతున్నారు. అంకమ్మరావు భార్య చీరాలలో నివాసం ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది.
 
 వారం క్రితం ఇంటికి వచ్చి...
 వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన అంకమ్మరావు భార్యా పిల్లలతో కలిసి జాగర్లమూడి వెంకటేశ్వర స్వామి గుడిలో పొంగళ్లు పెట్టుకొని అందరితో కలివిడిగా మాట్లాడి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం బాబాయి బత్తుల శివయ్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వారం తిరగక ముందే అంకమ్మరావు కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పర్చూరు ఎస్సై శ్రీహరిరావు జాగర్లమూడిలోని అంకమ్మరావు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగి వివరాలు సేకరించారు. అంకమ్మరావు వివాద రహితుడని గ్రామంలోని అతని మిత్రులు చెబుతున్నారు.
 
 నా బిడ్డను వదిలిపెట్టండయ్యా.. మంగమ్మ, అంకమ్మరావు తల్లి
 ఎవరికీ ఎలాంటి అపకారం చేయని నా బిడ్డను తీవ్రవాదులు ఎత్తుకుపోయారని తెలిసిందయ్యా. నా బిడ్డ నాకు కావాలయ్యా.
 ప్రభుత్వం చొరవ తీసుకోవాలి...
 తండ్రి, వెంకటేశ్వర్లు
 నా బిడ్డను ప్రభుత్వం చొరవ తీసుకుని రక్షించాలి. వెంటనే నా బిడ్డ ఆచూకీ తెలపాలి. పని చేసే కంపెనీవారు వెంటనే నా బిడ్డను నాకు అప్పగించాలి. కుటుంబానికి  అతనే ఆధారం.
 ఎవరికీ అపకారం చేయలేదు...
 శ్రీనివాసరావు, అంకమ్మరావు అన్న
 నా తమ్ముడిని వదిలి పెట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మేము ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు. తీవ్రవాదులు మా తమ్ముడినే ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. వెంటనే వారు దయతలచి వదిలిపెట్టాలి. ఎలాంటి అపకారం తలపెట్టకూడదు.
 నిన్న కూడా ఫోన్‌లో మాట్లాడాడు...
 బాబాయి, బత్తుల శివయ్య
 నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడి బంధువులు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారగానే జనం వచ్చే సరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలుసుకునేసరికి తీవ్రవాదులు ఎత్తుకెళ్లారు.
 మంచి మిత్రుడు
 రమేష్, అదే కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్
 పదేళ్ల నుంచి ఇద్దరం ఒకే కంపెనీలో పని చేస్తున్నాం. అంకమ్మరావు నాకు మంచి మిత్రుడు.  జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పని చేస్తుండగా అంకమ్మరావు అసోం వెళ్లాడు. ఇప్పుడు తీవ్రవాదులు ఎత్తుకెళ్లారని తెలియడం  బాధ కలిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శిద్దామని వచ్చా. వెంటనే అతనిని వదిలిపెట్టాలి.
 
 నా భర్తకు ఏ పాపం తెలియదు...
 తన భర్తకు ఏ పాపం తెలియదని, ఎటువంటి వివాదాలకు వెళ్లేవారు కాదని భార్య వాణి వాపోయారు. తన పని తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తిని అకారణంగా అపహరించడం దారుణమని అన్నారు. గతంలో ఇదే కంపెనీకి చెందిన ఓ ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసి 20 రోజులు తర్వాత విడిచిపెట్టారని, తన భర్తకు ఎటువంటి హాని తలపెట్టకుండా విడుదల చేసేలా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement