అన్నిటికీ ఎర్ర చం‘ధన’మే | Sakshi
Sakshi News home page

అన్నిటికీ ఎర్ర చం‘ధన’మే

Published Mon, Oct 27 2014 3:25 AM

అన్నిటికీ  ఎర్ర చం‘ధన’మే

  • ఖజానాను ఎర్రచం‘ధనం’తో  నింపుకోవడానికి సర్కారు ఎత్తుగడ!
  •  60 ఏళ్లు నిండిన వృక్షాలను నరికివేసి, వేలం వేయాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం
  •  గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో ఎర్రచందనం వృక్షాలను కుదవబెట్టి రుణం పొందే ప్రయత్నం
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచం‘ధనం’తో ఖజానాను సుసంపన్నం చేసుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తొలుత శేషాచలం అడవుల్లో 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలను నరికివేసి.. టెండర్ల ద్వారా విక్రయించి నిధులను సమీకరించాలని భావిం చింది. కానీ.. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వ్యూహం మార్చింది. 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలను బ్యాంకుల్లో కుదవబెట్టి రుణాలు తీసుకోవడం ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించింది. కానీ.. వృక్షాలను కుదువబెట్టుకుని రుణాలు ఇచ్చే సంప్రదాయం ఎక్క డా లేదని బ్యాంకర్లు కొట్టిపారేస్తుండడం గమనార్హం.
     
    రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పని చేయాలన్నా ఎర్రచందనం దుంగలను విక్రయించి.. నిధులను సమీకరిస్తామని సీఎం చంద్రబా బు పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. చిత్తూరు, వైఎస్‌ఆర్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో 4,755.997 చదరపు కి.మీ మేర శేషాచలం కొండలు వ్యాపించి ఉన్నాయి. ఈ కొండల్లో 174 కుటుం బాలకు చెందిన 1,500రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. ఇందులో ఎర్రచందనం అత్యంత విలువైనది. శేషాచలం  కొండల్లో 3,640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం(8.99 లక్షల ఎకరాల)లో ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించి ఉంది.

    రెండు దశాబ్దాల క్రితం ఎర్రచందనం విక్రయాలను కేంద్రం నిషేధించడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేస్తూ.. మయన్మార్, బ్యాంకాక్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్‌లకు అక్రమంగా చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలించే క్రమంలో చేసిన తనిఖీల్లో పోలీసు, అటవీశాఖ అధికారులు 8584.1353 టన్నులను స్వాధీనం చేసుకున్నారు.

    ఆ దుంగలను విక్రయించి నిధులను సమీకరిస్తామని జూన్ 10న సీఎం చంద్రబాబు ప్రకటించారు. పనిలో పనిగా శేషాచలం అడవుల్లో 60 ఏళ్లు నిండిన వృక్షాలను ప్రభుత్వమే నరికివేయించి.. టెండర్ల ద్వారా విక్రయిస్తుందని సెలవిచ్చారు. తద్వారా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని చెప్పుకొచ్చారు. ఎర్రచందనం విక్రయంలో భాగంగా తొలి దశలో 4,159.693 టన్నులను ఈ-టెండర్ కమ్ వేలం పద్ధతిలో అమ్మే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థయిన మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎమ్‌ఎస్‌టీసీ)కి జూలై 25న ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు ఎస్‌ఎస్‌టీసీ ఆగస్టు 8న ఎమ్‌ఎస్‌టీసీ ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేసింది.
     
    గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర..

    అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరికివేసి, టెండర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయిస్తోందని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యం విచారణ ప్రారంభించిన గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఎర్రచందనం వృక్షాలను నరికివేసి, ఎలా విక్రయిస్తారని వివరణ కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. తాము ఎర్రచందనం వృక్షాలను నరికివేయడం లేదని, స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలనే టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వివరించింది.

    ప్రభుత్వ వాదనతో ఏకీభవించని గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్రచందనం విక్రయ టెండర్లపై స్టే విధించింది. గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్రతో ప్రభుత్వం రూటు మార్చింది. అడవుల్లో ఉన్న వృక్షాలను నరికివేయడం పర్యావరణానికి విఘాతం కల్పించడమేనని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టీకరించిన నేపథ్యంలో.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ వృక్షాలను జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకోవడం ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
     
    నవంబర్ 2 నుంచి సర్వే..

    శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్ష సంపదపై సర్వే చేయాలని అటవీశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అటవీశాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఎర్రచందనం వృక్షాలను లెక్కించనున్నారు. ఆ వృక్షాల వయసు ఆధారంగా వర్గీకరించనున్నారు. ఏ ఏ బ్లాకుల్లో ఏ మేరకు వృక్షాలు ఉన్నాయన్న లెక్కను పక్కాగా తేల్చనున్నారు. ఆ తర్వాత శాటిలైట్‌తో సర్వే చేయించి.. వృక్షసంపదను గుర్తించనున్నారు.

    ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. తిరుపతిలో ఏర్పాటుచేసే సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థతో వాటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎర్రచందనం వృక్షాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి.. స్మగ్లర్ల బారిన పడకుండా చూడవచ్చునన్నది ప్రభుత్వ ఆలోచన. వృక్షాల సంఖ్య పక్కాగా తేలాక.. వాటిని జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాల సర్వేను ప్రారంభిస్తామని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement