ఆంధ్రా శిల్పారామం ఏక్కడ? | Sakshi
Sakshi News home page

ఆంధ్రా శిల్పారామం ఏక్కడ?

Published Wed, Dec 23 2015 12:25 AM

ఆంధ్రా శిల్పారామం ఏక్కడ? - Sakshi

శిల్పారామం నిర్మాణంలో అలసత్వం
వనరులు సమకూరినా పనులు ప్రారంభించని ైవె నం
పర్యాటక శాఖాధికారుల పని తీరుపై సర్వత్రా విమర్శలు

 
‘అమరావతిని ప్రపంచంలోకెల్లా సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం’ ఇదీ మైక్ పట్టినప్పుడలా ప్రజాప్రతినిధులు పదే పదే వల్లె వేసే పలుకులు. అయితే వీరు చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండడం లేదు. దీనికి శిల్పారామం ఏర్పాటే నిదర్శనం. జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు భూమి, నిధులు సమకూరాయి. అనుమతులు మంజూరయ్యాయి. అధికారుల్లో మాత్రం చలనం రాలేదు. ప్రజాప్రతినిధులకు పర్యవేక్షించాలన్న ఆలోచన కలగలేదు..శిల్పారామం నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు.
 
 
గుంటూరు వెస్ట్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా రాజధాని ప్రాంతంలో శిల్పారామం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా 13వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించతలపెట్టిన శిల్పారామం కోసం స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులోని సర్వే నంబర్ 237లో 3.60 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు అప్పగించారు. ఇదంతా కొన్ని నెలల క్రితమే పూర్తయింది. ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నెల 23న అడవితక్కెళ్లపాడులో జరిగే క్రిస్టియన్ భవన్ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు విచ్చేస్తున్నారు. ఆయనైనా దృష్టి సారించిశిల్పారామం నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.  

కళాత్మక విలువలు ఉట్టిపడేలా..
1992లో శిల్పారామాల ఏర్పాటు ప్రారంభమైంది. సాంస్కృతిక వారసత్వం, భారత కళల సంరక్షణ, చేతివృత్తిల వారిని చైతన్య పరచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ శిల్పారామాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నో కొయ్యబొమ్మలు, ఆభరణాలు, వస్త్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, కళాత్మక విలువలను ఉట్టిపడేలా రూపొందిస్తుంటారు. హాలిడే స్పాట్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంత ప్రాధాన్యమున్న శిల్పారామం
 ఏర్పాటుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 
ప్రత్యేక అధికారిని నియమించాలి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న శిల్పారామాలకు తక్షణం ప్రత్యేక అధికారిని నియమించాలి. గతంలో శిల్పారామాల కంటే అత్యంత అద్భుతంగా, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా వాటిని తీర్చిదిద్దాలి. రాజధాని ప్రాంతమైన గుంటూరులో శిల్పారామం నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి.
జాస్తి వీరాంజనేయులు, జాతీయ కార్యదర్శి, అఖిల భారత పంచాయతీ పరిషత్   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement