రూ.1.50 లక్షల కోట్ల అప్పులు పంపకం | Sakshi
Sakshi News home page

రూ.1.50 లక్షల కోట్ల అప్పులు పంపకం

Published Mon, Nov 17 2014 1:45 AM

రూ.1.50 లక్షల కోట్ల అప్పులు పంపకం - Sakshi

* పంపకానికి రెండు రాష్ట్రాల సుముఖత
* అకౌంటెంట్ జనరల్ వద్ద అంగీకారం
* 58 : 42 లెక్కన విభజన  
* ఆర్‌ఐడీఎఫ్, ఉద్యోగుల పీఎఫ్‌నిధి రుణాలపై కుదరని ఏకాభిప్రాయం
* మరిన్ని వివరాలు కోరిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల్లో ప్రస్తుతానికి 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు రెండు రాష్ట్రాలకు పంపిణీ కానున్నాయి. విభజన చట్టం ప్రకారం ఈ అప్పులను ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతంగా పంపకం చేయనున్నారు. అయితే ప్రాజెక్టుల వారీగా లేదా ఒక ప్రాంతంలో ఖర్చు చేసిన వాటికి మాత్రం ఇరు రాష్ట్రాలకు కాకుండా ఏ ప్రాంతంలో ఆ నిధులు వినియోగిస్తే.. ఆ రాష్ట్రమే రుణాలు భరించాలని రెండు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి. అకౌంటెంట్ జనరల్ వద్ద జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు.

కాగా, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకున్న అప్పులపై మరిన్ని వివరాలను టీ సర్కార్ కోరినట్లు సమాచారం. విదేశీ రుణాలున్నా.. అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే కావడంతో.. వాటిని కేంద్ర అప్పులుగా చూపించనున్నారు. ఇటీవల ఏజీ వద్ద జరిగినసమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌కల్లం, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులు పాల్గొన్నారు. ఈ అప్పుల్లో లక్ష కోట్లకుపైగా నిధులను బహిరంగ మార్కెట్ నుంచి రుణాల రూపంలో తెచ్చుకున్నారు. అలాగే జాతీయ పొదుపు రక్షణ నిధి (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్) నుంచి తెచ్చుకున్న నిధులు ఆరేడు వేల కోట్ల రూపాయల మేరకు ఉంటాయని అంచనా.

కేంద్రం ద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో.. కొన్ని ప్రాజెక్టులకోసం ప్రత్యేకంగా వ్యయం చేసినందున, అలాంటి వాటిలో ఆ ప్రాజెక్టు ఎక్కడ ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా అంగీకారం కుదిరింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్), అలాగే చిన్నమొత్తాల పొదుపు నిధులను కూడా ఏయే ప్రాంతంలో ఎంత ఖర్చు చేశారన్న అంశంపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు కోరినట్లు సమాచారం.

కాగా, ప్రస్తుతం పంపిణీకి ఇబ్బందిలేని రుణాలే లక్షన్నర కోట్ల వరకు ఉంటాయని లెక్క తేల్చారు. ఇవి కాకుండా వివాదాస్పదం అనుకున్న రుణాలు మరో 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారిక వర్గాలు వివరించాయి. వివిధ వృత్తి సంఘాల సమాఖ్యలకు ఇచ్చిన రుణాల్లో కూడా.. ఈ సమాఖ్యలు ఎక్కడ రుణాలు ఇచ్చాయన్న విషయాన్ని తేల్చిన తరువాత వాటిని పంపిణీ చేయాలని ఇరుపక్షాలు కోరినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement