సంస్కృత ఆచార్యుని సెక్స్‌ పాఠాలు! | Sakshi
Sakshi News home page

సంస్కృత ఆచార్యుని సెక్స్‌ పాఠాలు!

Published Tue, Nov 7 2017 11:28 AM

Andhra University Sanskrit professor 'sexually harasses' girls - Sakshi

ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు): ‘మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. ఒకరి తర్వాత ఒకరు నా గదిలోకి రండి. నువ్వు నవ్వితే నాకు ఏదో అయిపోతోంది. ఐ లైక్‌ యూ. ఐ లవ్‌ యూ..’ అంటూ సంస్కృత విభాగాధిపతి ఆచార్య ఏడుకొండలు తమను వేధిస్తున్నాడని పలువురు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినులు సహచర విద్యార్థులతో కలసి సోమవారం ఆందోళనకు దిగారు. సంస్కృతం బోధించకుండా ప్రేమపాఠాలు చెబుతున్నాడని, తరగతి గదిలో అశ్లీలత ప్రధానంగా బోధన సాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.గాయత్రీదేవికి ఫిర్యాదు చేశారు. అమ్మాయిలంతా ముందు వరుసలోనే కూర్చోవాలని ఆదేశిస్తాడని, నిత్యం శృంగార పాఠాలే బోధిస్తున్నాడని, ఆయన ఉపయోగించే భాష చాలా జుగుప్సాకరంగా ఉంటోందని చెప్పారు. కొన్ని నెలలుగా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని అడిగినందుకు చెప్పలేని పదజాలంతో తమను వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కులు కావాలంటే నగ్నంగా రావాలన్నాడని ఆరోపించారు.

విద్యార్థినుల టాయిలెట్‌లో కండోమ్స్‌ చూశామని, వీటిని తాము ఫొటోలు సైతం తీశామన్నారు. దీనిని బట్టి విభాగాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడని అర్థమవుతోందన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుకొండలుకు పదోన్నతి కల్పించి, రెండో పర్యాయం విభాగాధిపతిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన్ను వెంటనే సస్పెండ్‌ చేయని పక్షంలో విద్యార్థినులకు రక్షణ ఉండదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామమోహనరావు సంస్కృత విభాగానికి వెళ్లి విద్యార్థులు, పరిశోధన విద్యార్థులతో మాట్లాడారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని రెక్టార్‌ ఆచార్య గాయత్రీదేవి తెలిపారు. ఏడుకొండలు వ్యవహారంపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు.

అభాండాలు వేస్తున్నారు..
తనపై విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలను ఆచార్య ఏడుకొండలు ఖండించారు. ఇటీవల హాజరు శాతాలను లెక్కించి తక్కువగా ఉన్నవారిని కాండినేషన్‌ ఫీజు కట్టమని చెప్పడంతో ఈ విధంగా అభాండాలు వేస్తున్నారని చెప్పారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, వర్సిటీ నిబంధనల మేరకే పనిచేస్తున్నానని అన్నారు.

Advertisement
Advertisement