అంగన్‌వాడీల సమస్యలకు అధికారులే కారణం | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యలకు అధికారులే కారణం

Published Thu, Oct 24 2013 3:44 AM

Anganwadi members facing problems due to officers

ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలకు, కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉండడానికి అధికారుల తీరే కారణమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ ఎదుట బుధవారం అంగన్‌వాడీల సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు మెరుగుపడక పోవడంలో ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యమే ఉందని ఆరోపించారు. ఐసీడీఎస్‌లో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, వాటి సక్రమ నిర్వహణకు అధికారుల, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు.

ఐసీడీఎస్, ఐకేపీ సంయుక్తంగా అమలు చేయాల్సిన పథకం నీరుగారిపోతోందని, ఐకేపీ సిబ్బంది సరుకులు సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సబల పథకంలో బియ్యం, నూనె  మాత్రమే ఇస్తున్నారని, మిగితా సరుకులు ఐసీడీఎస్ అధికారులు, కాంట్రాక్టర్లు కాజేస్తున్నారని పేర్కొన్నారు. చాలా రకాలుగా ప్రభుత్వ పను లు చేపట్టేందుకు అధికారులు అంగన్‌వాడీలను ఇష్టారీతిన వాడుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల అద్దె సైతం ఆరు నెలలుగా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల సమస్యలన్నీ పరి ష్కరించాలని డిమాండ్ చేశారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన  కార్యదర్శి ఎస్‌కే నజీమా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్.రేష్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి, రాజమణి, వివిధ ప్రాజెక్ట్‌ల నాయకులు గోదావరి, పార్వతి, కళావతి, పద్మ, వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement