ఉల్లి సరఫరాపై ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఉల్లి సరఫరాపై ఆగ్రహం

Published Tue, Sep 8 2015 2:34 AM

ఉల్లి సరఫరాపై ఆగ్రహం - Sakshi

తెల్ల కార్డుదారులందరికీ రెండు కిలోలు ఇవ్వాలి
ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలి
 అధికారులు నెలకు ఒక్కో నియోజకవర్గంలో రెండు మండలాల్లోనైనా పర్యటించాలి
 సమీక్షలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్

 
 పీలేరు: ‘ఓ పద్ధతి లేకుండా ఎవరికి పడితే వారికి ఉల్లి ఇచ్చేస్తే అర్హులైన నిరుపేదలకు ఎలా అందుతుంది’ అంటూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పీలేరు వీఎస్‌ఆర్ కల్యాణ వేదికలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికీ రెండు కిలోల చొప్పున ఉల్లి అందజేయాలన్నారు. ఇష్టానుసారం ఎవరికి పడితే వారికి ఇవ్వడమేంటని మండిపడ్డారు. ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు తమకు సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులే అమ్ముతున్నారని కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో నెలకు రూ.40 కోట్లు పెన్షన్లు ఇస్తున్నామని, లబ్ధిదారులకు పింఛన్ అందుతుందా లేదా అన్న విషయం ఎంపీడీవో విచారించాలన్నారు. వృద్ధులు రాలేని స్థితిలో ఉంటారని, వారందరికీ ఇంటింటికీ వెళ్లి  అందజేయాలని సూచించారు. ఉపాధిలేదని ఏ ఒక్కరూ ఇతర ప్రాంతాలకు వలసలు వె ళ్లాల్సిన అవసరం లేదన్నారు. కూలీలందరికీ స్థానికంగానే పనులు కల్పించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఏమిచేస్తారో ఏమోకానీ ప్రజలందరికీ విధిగా రక్షిత మంచినీరు అందించాలని ఆదేశించారు. డబ్బులతో ఇబ్బందిలేదన్నారు. జిల్లా అధికారులు నెలలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండు మండలాల్లోనైనా పర్యటించాలన్నారు. హార్టికల్స్ పనితీరుపై సంతృప్తిగా లేనన్నారు.  మండలానికి ఇద్దరు మోటార్ మెకానిక్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. విద్య, వైద్యం, విద్యుత్, పంచాయతీ, వ్యవసాయం తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement