అనూహ్య హత్య కేసు పురో‘గతి’ ఏదీ? | Sakshi
Sakshi News home page

అనూహ్య హత్య కేసు పురో‘గతి’ ఏదీ?

Published Mon, Jan 20 2014 2:46 AM

అనూహ్య హత్య కేసు పురో‘గతి’ ఏదీ? - Sakshi

 కిరాతకంగా హత్యకు గురైన అనూహ్య కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చేనా? నిందితులను పట్టుకోవడంలో ముంబై పోలీసుల పనితీరులో నిబద్ధత ఉంటుందా? ఆచూకీ కోసం ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోనివారు ఇప్పుడు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరిస్తారా? అనే అనుమానాలు అనూహ్య కుటుంబసభ్యులు, బంధువుల్లో వ్యక్తమవుతున్నాయి. సంచలనం కలిగించిన ఈ కేసులో నేరస్తులకు శిక్షపడితేనే అనూహ్య కుటుంబసభ్యులకు న్యాయం జరుగుతుందని, మున్ముందు మహిళలకు భరోసా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 మచిలీపట్నం, న్యూస్‌లైన్ :
 సంచలనం కలిగించిన సింగవరపు ఎస్తేరు అనూహ్య హత్య కేసులో ఎలాంటి పురోగతీ లేదు. ఈ నెల ఐదున ముంబై చేరిన అనూహ్య 16న శవమై కనిపించింది. ఆమె తండ్రితో పాటు బంధువులు చేసిన ప్రయత్నంలోనే మృతదేహం లభ్యమైంది. అక్కడి పోలీసుల నుంచి ఎలాంటి సహకారం లేకపోవటంతో అనూహ్య హత్యకు గురైందనే వాదన బంధువుల నుంచి వినిపిస్తోంది. రైలు ముంబైకి చేరాక అనూహ్య ఎక్కడ దిగింది.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందనే అంశం వెలుగులోకొస్తేనే ఈ హత్యకేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. అనూహ్యను క్యాబ్ డ్రైవరే హతమార్చి ఉంటాడనేది ఒక ప్రచారం. అయితే క్యాబ్ డ్రైవర్ అంత పకడ్బందీగా అనూహ్యను చంపి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాబ్ డ్రైవర్లు హత్యకు పాల్పడితే శరీరంపై ఉన్న బంగారు నగలు, నగదు దోచుకునేవారని.. నగలు, సెల్‌ఫోన్ ఆమె వద్దే ఉండటంతో ఇది క్యాబ్ డ్రైవర్ల ఘాతుకం కాదనేది మరో వాదన.
 
  సహోద్యోగులపైనా అనుమానం...
 అనూహ్యతో పాటు ముంబై టీసీఎస్ కంపెనీలో పనిచేసే సహోద్యోగులు ఎవరైనా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి ఆమెను హతమార్చారా అనే అనుమానాలు లేకపోలేదు. ముంబై టీసీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ముంబై పోలీసులు చెబుతున్నా ఇంతవరకు ఈ హత్యకు దారితీసిన ఘటనపై కనీస సమాచారం బంధువులకు చెప్పకపోవటంపై వీరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనూహ్య మృతదేహం లభ్యమైనచోట యాసిడ్ లేదా రసాయనాలు వాడిన డబ్బాలు లభ్యమయ్యాయని, వాటిపై వేలిముద్రల ఆధారంగానైనా నిందితులను గుర్తించడానికి ఇంత సమయం పడుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నెల ఐదోతేదీ నుంచి అనూహ్య ఫోన్ వాడకపోవటం, ఆమె ఫోన్‌కు వచ్చిన కాల్స్ డేటా ఆధారంగానైనా నిందితులను గుర్తించే అవకాశం ఉన్నా ఆ దిశగా అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారా లేదా అన్నది ప్రశ్నార్థకమే.
 
 సక్రమంగా పనిచేయని సీసీ కెమెరాలు...
 అనూహ్య దిగిన రైల్వేస్టేషన్ వద్ద సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయటం లేదని ముంబై నుంచి వచ్చిన ఆమె బంధువులు చెబుతున్నారు. అనూహ్య హత్య కేసులో ఎంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారనే అంశంపై ఆమె కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారి ముంబైలో పనిచేస్తున్నారు. ఈ అధికారికి అనూహ్య కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉన్నా తాను సమాచారం చెబుతానని ఈ అధికారి హామీ ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం రాత్రి 9.30 గంటల వరకు అనూహ్య బంధువులకు ఎలాంటి సమాచారం లేదు. అనూహ్య హత్యకేసులో ఎవరినైనా గుర్తించారా అని ప్రశ్నిస్తే తమకు ముంబై నుంచి పోలీసు అధికారులు ఎవరూ ఫోన్ చేయలేదని చెబుతున్నారు.
 
 ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్య తండ్రి ప్రసాద్‌కు ఫోన్ చేసి ఈ హత్య కేసును ఛేదించేందుకు ముంబైలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. అయితే ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తారా, ఏర్పాటు చేసినా అక్కడి పరిస్థితులను బట్టి ఈ బృందం ఎంత మేర ఈ కేసును ఛేదించగలుతుందనే అంశాలపైనా అనూహ్య బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, పాలకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముంబై పోలీసులపై ఒత్తిడి తెస్తేనే ఈ కేసులోని మిస్టరీ వీడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ముంబై పోలీసులు చెబుతున్నా గత మూడు రోజులుగా ఎలాంటి ముందడుగూ పడకపోవడంతో కేసును నీరుగార్చే అవకాశముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement