దుర్గగుడికి మరో ఘాట్ రోడ్డు | Sakshi
Sakshi News home page

దుర్గగుడికి మరో ఘాట్ రోడ్డు

Published Sat, Apr 9 2016 12:42 AM

దుర్గగుడికి మరో ఘాట్ రోడ్డు

కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఘాట్‌రోడ్డు మొదటి మలుపు వరకు..
భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి వాసులకు ఉపయుక్తం
దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం
ర్యాంపు నిర్మాణం పూర్తయితే కొండ మీదకు మూడు మార్గాలు

 

దుర్గగుడి వద్ద మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. అర్జునవీధిలో ర్యాంపు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు.  ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది.

 

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డు మధ్య నుంచి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు      ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు దుర్గాఘాట్, మరోవైపు ఇంద్రకీలాద్రి మధ్య రోడ్డు తక్కువగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. గొల్లపూడి, భవానీపురం, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు దుర్గాఘాట్ వరకూ వచ్చి ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించకుండా కుమ్మరిపాలెం సెంటర్ వద్ద నుంచే నేరుగా కొండ మీదకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్ణయించారు.


సర్వే షురూ
కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న మొదటి మలుపు, ఓం టర్నింగ్ వరకూ ఒక ఘాట్‌రోడ్డు ఏర్పాటుచేస్తే దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చేవారు ఆ ఘాట్‌రోడ్డు నుంచి వస్తారు. వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజీవైపు నుంచి వచ్చే వాహనాలు ప్రస్తుతం ఉన్న పాత ఘాట్‌రోడ్డులో నుంచే వస్తాయి. రెండు ఘాట్‌రోడ్లు మొదటి మలుపు వద్ద కలుస్తాయి. దీనిపై ఇటీవల దేవస్థానం అధికారులు సర్వే చేయగా, సుమారు 265 మీటర్ల ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేయాలని అంచనా వేశారు.


కమిషనర్ అనుమతులు లభించాకే..
రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటు అనేది ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. వాస్తుతో పాటు ఎంత ఖర్చవుతుంది?, బాధితులకు ఎంతమేర నష్టపరిహారం ఇవ్వాలి?.. తదితర అంశాలపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. వీటిపై పూర్తిగా ఒక స్పష్టత వచ్చిన తరువాత, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తీసుకున్నాక ప్రారంభిస్తామని ఇంజినీరింగ్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

 

 

ర్యాంపు పూర్తయితే..
అర్జున వీధి విస్తరణతో పాటు మల్లికార్జున మహామండపం మొదటి అంతస్తుకు ర్యాంపు  నిర్మిస్తున్నారు. అలాగే, అర్జున వీధి విస్తరణ          పూర్తయిన తరువాత మల్లికార్జున మహామండపానికి హైస్పీడ్ లిప్టులు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డుకు కొత్తగా నిర్మించే రోడ్డుతో పాటు అర్జున వీధిలో ర్యాంపు నిర్మాణం పూర్తయితే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు.

 

నివాసాల తొలగింపునకు సర్వే
గతంలో కనకదుర్గా ప్లైఓవర్ కోసం హెడ్ వాటర్‌వర్క్స్ ఎదురుగా ఉన్న కొన్ని ఇళ్లు తొలగించారు. ఇప్పుడు రెండో ఘాట్‌రోడ్డు పేరుతో మరో 170 ఇళ్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి చూస్తే కేవలం ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు తప్ప ఇళ్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగిస్తున్నారనే అపోహ కూడా ఇళ్ల యజమానుల్లో ఉంది. ఈ ఇళ్ల తొలగింపునకు సర్వేను రెవెన్యూ విభాగం అధికారులు రెండు రోజులుగా చేపడుతున్నారు. కాగా, గతంలో ఇంద్రకీలాద్రిపై తొలగించిన ఇళ్లకు ఇచ్చిన నష్టపరిహారం మాదిరిగానే తమకూ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

 

Advertisement
Advertisement