జిల్లాలో ఐదుకి పెరిగిన కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐదుకి పెరిగిన కరోనా కేసులు

Published Thu, Apr 30 2020 12:53 PM

Another Five Corona Cases File in Srikakulam - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పరీక్షల జోరు పెంచడంతో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. క్వారంటైన్‌ గడువు పూర్తయిన తర్వాత కేసులు బయటపడుతుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీ నుంచి జిల్లాకొచ్చిన 39 రోజుల తర్వాత ఒక విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. అదే ఇంట్లో ఉంటున్న ఏడుగురు కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చింది. విజయవాడ నుంచి నరసన్నపేట వచ్చిన బాలుడికి ట్రూనాట్‌ కిట్‌ పరీక్షల్లో అనుమానిత ఫలితం వచ్చినా వైరాలజీ ల్యాబ్‌లో నెగిటివ్‌ రావడం ఊరట కలిగించింది. తాజాగా నమోదైన ఢిల్లీ కేసుతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుగురికి చేరింది. పాజిటివ్‌ వచ్చినవారంంతా ఆరోగ్యంగా, ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉన్నారు. జెమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ కోసమని వెళ్లి..
శ్రీకాకుళం పీఎన్‌ కాలనీకి చెందిన 24 ఏళ్ల విద్యార్థి సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ కోసమని ఢిల్లీ వెళ్లాడు. రెండు నెలలపాటు అక్కడే ఉన్నాడు. మార్చి 18న ఎయిరిండియా ఎ 1–451 విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ వచ్చాడు. అక్కడి నుంచి కారులో శ్రీకాకుళం చేరుకున్నాడు. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. పాతపట్నం కేసుతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ, ముంబాయి, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో తానొచ్చిన 39 రోజుల తర్వాత ఆ విద్యార్థికి పాజిటివ్‌ అని తేలింది. తొలుత ట్రూనాట్‌ కిట్‌ పరీక్షల్లో అనుమానిత ఫలితం రాగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అతనికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. అతని కుటుంబంలోని ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్‌ వచ్చింది. 

విమానంలో 187మంది..
పీఎన్‌ కాలనీ యువకుడు ప్రయాణించిన విమానంలో 187మంది ఉన్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 10మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఏడుగురు, విశాఖపట్నం జిల్లాకు చెందిన 92మంది, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏడుగురు, ప్రకాశం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. మిగతా వారు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నట్టు ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అధికారులు గుర్తించి, అక్కడి అధికారులను అలెర్ట్‌ చేశారు. 

క్వారంటైన్‌కు 30మంది  
హోం క్వారంటైన్‌ ముగిశాక ఆ యువకుడు సమీపంలోని జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఏడుగురు ఉన్నారు. విశాఖలో విమానం దిగి కారులో వస్తున్నప్పుడు కారులో మరో స్నేహితుడు, డ్రైవర్‌ ఉన్నారు. ఇలా కాంటాక్ట్‌ అయిన 30మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా కొందరికి నెగిటివ్‌ వచ్చింది. మరికొందరి ఫలితాలు రావల్సి ఉంది. 

ఊపిరి పీల్చుకున్న నరసన్నపేట ప్రజానీకం  
విజయవాడ నుంచి వచ్చిన నరసన్నపేట మండలం చోడవరం బాలుడికి ట్రూనాట్‌ పరీక్షల్లో అనుమానిత ఫలితం రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే కాకినాడ వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు పంపించగా నెగిటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఆ బాలుడితో కాంటాక్ట్స్‌ ఉన్న వారిని క్వారంటైన్‌లో ఉంచారు. అందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.  
పాతపట్నం క్వారంటైన్‌లో మరో 30మంది  
కాగువాడ, పెద్ద సీధి, కురసవాడ గ్రామాల్లో జరిగిన వివాహ,చావు కార్యక్రమాల్లో పాల్గొన్న మెళి యపుట్టి, సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన 30మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. నాలుగు పాజిటివ్‌ కేసులున్న కుటుంబం వీటికి హాజరు కావడంతో వారికి కోవిడ్‌ మొబైల్‌ విస్క్‌ ద్వారా పరీక్షలు చేపడుతున్నారు. పాతపట్నంలోని ఒక వైద్యుడికి, బూరగాంలోని ఒక మహిళకు ప్రాథమిక పరీక్షల్లో అనుమానిత లక్షణాలు కనిపించడంతో రిమ్స్‌కు తరలించారు. 

‘కాంటాక్ట్‌’ల గుర్తింపు వేగవంతం
పాతపట్నం: పాజిటివ్‌ వచ్చిన వారి బంధువులు, సన్నిహితులు మొత్తం 180 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. వారి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. సీతంపేట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేష్‌ నేతృత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.    

పీఎన్‌ కాలనీ దిగ్బంధం
శ్రీకాకుళం: కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన పీఎన్‌ కాలనీలో ఆంక్షలను కచ్చితంగా పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు నిర్మించి రాకపో కలను కట్టడి చేశారు. తాగునీరు, నిత్యావసర స రుకుల సరఫరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. జేసీ శ్రీనివాసులు, ఎస్పీ అమ్మిరె డ్డి, కమిషనర్‌ నల్లనయ్య బుధవారం కాలనీని పరిశీలించారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ర్యాపిడ్‌ పరీక్షలు జరుపుతున్నారు. కలెక్టర్‌ నివా స్‌ ఆదేశంతో మంగళవారం నుంచే హైపో క్లో రైట్‌ ద్రావణాన్ని పిచికారి చేసి బ్లీచింగ్‌ జల్లుతున్నారు. రెడ్‌క్రాస్‌ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సచివాలయ, మున్సిపల్‌ ఉద్యోగులకు శానిటైజర్లు పంపిణీ చేసింది. రెడ్‌క్రాస్‌ పొందూరు శాఖవారు 120, అక్షయపాత్ర ద్వా రా 850 మందికి ఆహారం అందించారు. ఈ కా లనీని పరిశీలించి వెళుతుండగా, ఏడు రోడ్ల కూ డలి వద్ద ఓ యువకుడిని గమనించి ఎస్పీ ప్ర శ్నించారు. సరుబుజ్జిలికి చెందిన ఆ యువకుడు హైద్రాబాద్‌ నుంచి వాహనాలు మారుతూ వ చ్చి, కాలినడకన శ్రీకాకుళం చేరుకున్నట్టు చెప్పడంతో అతనిని క్వారంటైన్‌కు పంపించారు. 

ఇంటింటికీ సరుకులు
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా పౌరసరఫరాల అధికారి జి.నాగేశ్వరరావు సూపర్‌మార్కెట్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. విశాల్‌ మార్టు వారు 3, 4 ,5 లైన్లలో ఉన్న వారికి, 1, 2, 6 లైన్లకు ఎస్‌కేఎల్‌ సూపర్‌ బజార్, మణికంఠ, శ్రీనివాస్‌ సూపర్‌ మార్కెట్‌ వారు సరుకులు అందిస్తారని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement