గోవాడపై మరో మరక! | Sakshi
Sakshi News home page

గోవాడపై మరో మరక!

Published Wed, Feb 3 2016 11:29 PM

Another stain on govada!

చక్కెర అమ్మకాల్లో గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు
వెంటాడుతున్న కోర్టు నోటీసులు
తాజాగా పాలకవర్గంపై పోలీసు కేసులు

 
చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా ఉన్న గోవాడ సుగర్స్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా  ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీని అవకతవకలు,  అవినీతి మరకలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీలతోపాటు పాలకవర్గంపై  గ్రీన్‌మింట్ కంపెనీ కోర్టు కెక్కి కేసులు పెట్టడం  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.   ఏటా  సుమారు 5 లక్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తూ  24 వేల మంది రైతులకు ఆసరాగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో టీడీపీ పాలకవర్గం వచ్చాక తరుచూ ఏదో అవినీతి ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి.  2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా నష్టాలు కలిగించింది. గొడౌన్ల పైకప్పుల ఎగిరిపోయి, పంచదార నిల్వలు తడిసిపోయి నష్టం కలగగా, మరో పక్క ఆ తడిసిన పంచదార అమ్మకాల్లో   అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, పోలీసు కేసులతో  ప్రతిష్ట దిగజారిన పరిస్థితి నెలకొంది.
 
వెల్లువెత్తిన ఆరోపణలు
తడిసిన పంచదార అమ్మకాలు, ఇన్సూరెన్సు పరిహారం మంజూరులో కొంత హైడ్రామా నడిచినట్టు అప్పట్లో ఆరోపణలు వెళ్లువెత్తాయి.  నష్టాలను బూచిగా చూపిస్తూనే మరో పక్క పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కై రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. వైఎస్సార్‌సీపీ, ఇతర రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ విషయమై అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.  కశింకోట సీడబ్ల్యుసీ గొడౌన్లలో నిల్వ చేసిన లక్షా 19 వేల క్వింటాళ్ల  తడిసిన పంచదార అమ్మకాల్లో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలే ఇప్పుడు ఫ్యాక్టరీని  కుదిపేస్తున్నాయి. తడిసిన పంచదారను టెండర్ల ద్వారా అమ్మే క్రమంలో   హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్ ప్రైవేటు కంపెనీ  టెండర్లు దగ్గించుకుంది. తర్వాత  ఫ్యాక్టరీ యాజమాన్యం మరో ట్రేడర్‌తో ఒప్పందం కుదుర్చుకొని సరకును అమ్మేయడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో సుమారు రూ.8 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెళ్లువెత్తాయి.

నేరుగా రంగంలోకి గ్రీన్‌మింట్
ఫ్యాక్టరీలో ఇంత భాగోతం జరుగుతోందని తెలుసుకున్న గ్రీన్‌మింట్ కంపెనీ నేరుగా రంగంలోకి దిగింది. తన కంపెనీ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని, ఇన్సూరెన్సు సంస్థకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరోపక్క అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం, మహాజన సభలో సైతం నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం అదనపు జాయింట్ కలెక్టర్‌తో చేయిస్తున్న విచారణ కూడా కొనసాగుతోంది. ఇంతలో గ్రీన్‌మింట్ కంపెనీ వేసిన కేసు కారణంగా కోర్టు ఉత్తర్వులు మేరకు చైర్మన్, ఎండీ, ఇన్సూరెన్సు కంపెనీతోపాటు పాలకర్గంలో కొందరు డైరక్టర్లపై  చోడవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహరం మరో మారు గుప్పుమంది.  పాలకవర్గంపై కేసులు నమోదు కావడం ఫ్యాక్టరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా రైతుల్లో, ఫ్యాక్టరీ వర్గాల్లో  చర్చనీయాంశమైంది.
 
సుగర్స్ పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయాలి
చోడవరం: గోవాడ సుగర్ ప్యాక్టరీ పాలకవర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం డిమాండ్ చేసింది.   ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం, జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకతలేని పాలకవర్గం రైతులకు ఎటువంటి మేలు చేయదని,   వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచదార అమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కున్న పాలకవర్గం ఫ్యాక్టరీని మరింత నాశనం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు.  అవినీతి ఆరోపణలు నిగ్గుతేలే వరకు పాలవర్గం ఫ్యాక్టరీ పాలనలో దూరంగా ఉండాలన్నారు. తడిసిన పంచదార అమ్మకాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై వేసిన విచారణ కమిటీ నివేదిక వెంటనే బయటపెట్టాలని కోరారు. 

Advertisement
Advertisement